Begin typing your search above and press return to search.

భార్య ఇంటి పనుల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు!

ఈ కేసు వివరాల్లోకి వెళ్లితే.. ఇంటి పని చేయాలని అడగటంతో తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ.. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశాడు.

By:  Tupaki Desk   |   7 March 2024 8:08 AM GMT
భార్య ఇంటి పనుల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు!
X

ప్రస్తుతం చాలామంది భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం లేదా ఇద్దరూ పనులకు వెళ్లడం చాలా సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఇంటి పనుల విషయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భర్తతోపాటు సమానంగా తాము కూడా ఉద్యోగానికో, పనికో వెళ్తున్నామని, తాము సైతం జీతం తెస్తున్నామని.. అలాంటప్పుడు తామొక్కరమే ఇంటి పనులు ఎందుకు చేయాలనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పురుషులు సైతం ఇంటి పనులు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఇంటి పనుల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కిందకు రాదని కీలక తీర్పు ఇచ్చింది. బాధ్యతలను పంచుకోవడమే వివాహ బంధమని పేర్కొంది. తల్లిదండ్రులను విడిచి భార్యతో ఉండలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన కోర్టు ఆ దంపతులకు విడాకులు ఇచ్చింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్లితే.. ఇంటి పని చేయాలని అడగటంతో తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ.. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశాడు. వృద్యాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను విడిచి వేరు కాపురం పెట్టాలని తన భార్య వేధిస్తోందని తన పిటిషన్‌ లో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలని విన్నవించాడు.

ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడానికి తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కాడు.

ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి పిటిషన్‌ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యను ఇంటి పనులు చేయాలని భర్త కోరడం తప్పు కాదని స్పష్టం చేసింది. అది క్రూరత్వం కిందకు రాదని తెలిపింది. భార్యభర్త బాధ్యతలను పంచుకుంటేనే అది వివాహ బంధమని గుర్తుచేసింది.

స్త్రీ తన కుటుంబానికి చేసే సేవను ఆప్యాయతగా కోర్టు పేర్కొంది. అది సాయంతో సమానం కాదని తెలిపింది. వృద్యాప్యంలో ఉన్న భర్త తల్లిదండ్రులను వదలి రమ్మని అతడిని భార్య కోరడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిదేనని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.