డిప్యూటీ సీఎం పవన్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఈ-కామర్స్ సంస్థలకు గట్టి షాక్
వ్యక్తిగత హక్కులు కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By: Tupaki Desk | 2 Jan 2026 5:48 PM ISTవ్యక్తిగత హక్కులు కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ద్వారా పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేయడంతోపాటు డీప్‌ఫేక్ వీడియోలు పవన్ అనుమతి లేకుండా వాడటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పవన్ పేరు, ఫొటో, గొంతును వాణిజ్య ప్రకటనల కోసం వాడుకుంటూ లాభపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పవన్ వాదనలో న్యాయం ఉందని భావించిన హైకోర్టు సోషల్ మీడియాలో కంటెంట్ తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా, ఎక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. అదేసమయంలో పవన్ తాను తొలగించాలని కోరకుంటున్న లింకుల జాబితాను 48 గంటల్లో ఆయా సంస్థలకు అందజేయాలని హైకోర్టు సూచించింది. పవన్ ఫిర్యాదులను ఐటీ నిబంధనల ప్రకారం అధికారిక ఫిర్యాదులగానే పరిగణించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటువంటి హక్కుల కోసమే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వాడకూడదని గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి వారు కూడా ఇలాంటి తీర్పులే పొందారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పవన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టడంపై ఆయన గతంలో వేసిన పిటిషన్ పై గత వారమే హైకోర్టు విచారించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో సెలబ్రెటీల పర్సనాలిటీ రైట్స్ కు రక్షణ కల్పించినట్లైందని అంటున్నారు. ప్రధానంగా ఎవరైనా రెండు రకాలైన పర్సనాలిటీ హక్కులను కలిగి ఉంటారు. అందులో ప్రచార హక్కు ఒకటైతే రెండోది గోప్యతా హక్కు. ఒక వ్యక్తి గుర్తింపును అంటే పేరు, గొంతు, ఫోటో వంటివాటిని వాణిజ్యపరంగా వాడుకుని లాభపడకుండా నియంత్రించే హక్కును ప్రచార హక్కు అంటారు. దీనిప్రకారం పవన్ కల్యాణ్ లేదా ఇంకెవరి ఫొటోలు అయినా సరే వారి అనుమతి లేకుండా ఏదైనా వస్తువు అమ్మకానికి ప్రకటనగా వాడకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
అదేవిధంగా ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారిని పబ్లిక్‌గా ప్రదర్శించకూడదు లేదా వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. ఇది గోప్యతా హక్కు కిందకు వస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) కింద ఈ హక్కులు రక్షించబడతాయి. వీటి ద్వారా పేరు, సంతకం వాడటం, వ్యక్తులను పోలి ఉండే బొమ్మలు, యానిమేషన్లు సృష్టించడం, గొంతును అనుకరించి ప్రచారం చేసుకోవడం, ఒక నటుడికి మాత్రమే ప్రత్యేకమైన బాీ లాంగ్వేజ్ లేదా డైలాగ్ డెలివరీని అనుమతిలేకుండా వాణిజ్యపరంగా వాడకుండా ఈ హక్కులు కాపాడతాయి.
