కోర్టు సమయాన్ని వృధా చేస్తారా? దిమ్మ తిరిగే శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు
కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న ఇద్దరు నిందితులకు..ఢిల్లీ హైకోర్టు దిమ్మ తిరిగేలాంటి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
By: Tupaki Desk | 18 July 2025 3:00 PM ISTరెండు చేతులు పైకెత్తి నిటారుగా ఎంతసేపు నిలబడతారు? అంటే.. ఎవరైనా పది నిమిషాలు.. లేదంటే మరో ఐదు నిమిషాలు కలుపుకొని పావుగంటగా చెబుతారు. విన్నంతనే ఇదేం పెద్ద టాస్కు అనుకుంటారు కానీ.. దాన్ని మొదలుపెడితేనే.. అదెంత కష్టమైన పనో అర్థమవుతంది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న ఇద్దరు నిందితులకు..ఢిల్లీ హైకోర్టు దిమ్మ తిరిగేలాంటి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు వీరికి విధించిన వినూత్న శిక్ష మరేదో కాదు.. రెండు చేతులెత్తి నిటారుగా నిలబడటం.. అందుకు ఇచ్చిన టైంతోనే చిక్కంతా. ఎందుకుంటే కోర్టులో ఒక రోజు మొత్తం అలానే నిలబడాలని ఆదేశించటంతో.. నిందితులకు నోట మాట రాని పరిస్థితి.
2018కి సంబంధించిన ఒక కేసు తుది విచారణ ఢిల్లీ హైకోర్టులో జరుగుతోంది. ఇందులో నలుగురు నిందితుల్ని బెయిల్ బాండ్లు సమర్పించాలని చెప్పింది. కానీ.. వారు ఆ పని చేయలేదు. ఉదయం 10 గంటల నుంచి 11.40 గంటల మధ్య వరకు వెయిట్ చేసి.. రెండుసార్లు పిలిచిన తర్వాత కూడా నిందితులు బెయిల్ బాండ్లను సమర్పించలేదు. దీంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్న వైనంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐపీసీ 228వ సెక్షన్ కింద నిందితులు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు సమయం ముగిసే వరకు చేతులను నిటారుగా పైకెత్తి నిలబడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు కాగా.. ఇప్పటికే ఇద్దరు మరణించారు. మిగిలిన నలుగురు (కుల్దీప్.. రాకేశ్.. ఉపాసన.. ఆనంద్) మాత్రమే మిగిలారు. వీరి తీరుకు వినూత్న శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే.. ఈ నలుగురిలో కుల్దీప్ మాత్రం 12.48 గంటల ప్రాంతంలో బెయిల్ బాండ్.. దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో వాటిని స్వీకరించి కోర్టు అతడ్ని కోర్టు కస్టడీ నుంచి విడుదల చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఈ వ్యవహారం ఢిల్లీ కోర్టులో అందరి నోట నానేలా చేసింది.కోర్టు సమయాన్ని వృధా చేసే వారికి ఇదో హెచ్చరికగా చెబుతున్నారు.
