Begin typing your search above and press return to search.

సాక్షికి హైకోర్టు వార్నింగ్: హెరిటేజ్ కథనాలపై 24 గంటల డెడ్‌లైన్!

ఏపీలో హాట్ డిబేట్ జరుగుతున్న హెరిటేజ్ ఇష్యూపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Political Desk   |   19 Feb 2026 9:58 PM IST
సాక్షికి హైకోర్టు వార్నింగ్: హెరిటేజ్ కథనాలపై 24 గంటల డెడ్‌లైన్!
X

ఏపీలో హాట్ డిబేట్ జరుగుతున్న హెరిటేజ్ ఇష్యూపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయిస్తోందని వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైసీపీ, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సాక్షి మీడియాపై పరువు నష్టం కేసులు దాఖలు చేసింది. హెరిటేజ్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో హెరిటేజ్ పై సాక్షి రాసిన కథనాలు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా సాక్షి లింకులు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది.

సాక్షి మీడియా గ్రూపునకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలన చర్చకు తెరలేపాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో హెరిటేజ్ ను టార్గెట్ చేస్తూ విపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. శాసనమండలిలో సైతం హెరిటేజ్ పై ఆరోపణలు చేయడమే కాకుండా, వాయిదా తీర్మానాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ‘హెరిటేజ్’ఫై వాడివేడి చర్చ జరుగుతోందని అంటున్నారు. మరోవైపు సాక్షి మీడియాలోనూ ‘హెరిటేజ్’కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ‘హెరిటేజ్’ ఢిల్లీ హైకోర్టులో రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేసింది.

హెరిటేజ్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సాక్షిలో ‘హెరిటేజ్’పై ప్రసారమైన, ప్రచురితమైన అన్ని కథనాలను తొలగించాలని స్పష్టం చేస్తూ మధ్యాంతర ఉత్తర్వులిచ్చింది. ఇందుకు కేవలం 24 గంటల సమయమే ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. న్యాయస్థానం ఉత్తర్వులు సాక్షి గ్రూపునకు తగిలిన గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కి, బోలెబాబా డెయిరీకి సంబంధం ఉన్నట్లు సాక్షిలో కథనాలు రావడాన్ని హెరిటేజ్ సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేయగా, న్యాయస్థానం పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటల్లోగా అన్ని లింకులను తొలగించాలని స్పష్టం చేసింది. సాక్షి లింకులు తొలగించకపోతే మెటా, గూగుల్, యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సాక్షి గ్రూప్ ఇంకా స్పందించలేదు. ఈ ఉత్తర్వులపై అప్పీలు చేస్తుందా? న్యాయస్థానం ఉత్తర్వులను పాటించి ‘హెరిటేజ్’కి వ్యతిరేకంగా ప్రసారమైన కథనాలను తొలగిస్తుందా? చూడాల్సివుందని అంటున్నారు. మరోవైపు హెరిటేజ్ గ్రూప్ ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేయాలని గట్టిగా నిర్ణయించుకుందని అంటున్నారు. సాక్షి మీడియా గ్రూపుతోపాటు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు ఇచ్చింది.

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ‘హెరిటేజ్’ ప్రతిష్టకు భంగం కలిగిలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ తరపు న్యాయవాది జి. మల్లికార్జున రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 18, 2026 నాటి 'సాక్షి' పత్రికలో ప్రచురితమైన కథనం, అంతకుముందు బొత్స ప్రెస్ మీట్ ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదేనని, దాని ద్వారానే గతంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన ఆరోపణలను హెరిటేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ ఫుడ్స్‌కు మధ్య కేవలం ఒప్పంద తయారీ సంబంధం తప్ప, యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి 'సిండికేట్'గా ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు.వైఎస్ జగన్ ప్రేరేపణతోనే, రాజకీయ లబ్ధి కోసమే ఈ తప్పుడు ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ ఆరోపించింది. నాణ్యతకు మారుపేరుగా, అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల సంస్థ పరువు తీయడమే ధ్యేయంగా ఈ దుష్ప్రచారం సాగుతోందని లీగల్ నోటీసుల్లో ‘హెరిటేజ్’ పేర్కొంది. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నోటీసు జారీ చేసినందుకు గాను లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని.. క్షమాపణ చెప్పని పక్షంలో బి.ఎన్.ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.