కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పరా పల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ని కోర్టు నుంచి నేరుగా చంచల్ గూడ జైలుకు తరలించారు. నిన్న జానీ మాస్టర్ ని గోవాలోని పోలీసులు అదుపులో తీసుకుని హైదరాబాద్ కి తరలించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు ఆయన్ని హైదరా బాద్ శివార్లలోని ఓ రహస్య ప్రదేశంలో విచారించారు.
అనంతరం పోలీస్ అధికారులు కోర్టు ముందు ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐర్ నమోదు కాగా, జానీ మాస్టార్ పై ఆ పరేషన్ మొదలైంది. అరెస్ట్ చేస్తారనే కారణంగా జానీ మాస్టర్ తప్పించుకు తిరుగుతున్నాడనే ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నెట్టింట ప్రచారం సాగింది. చివరిగా ఆయన్ని గోవాలో అరెస్ట్ చేసారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు మైనర్ బాలికగా ఉన్న సమయంలో అత్యాచారం చేసాడనే ఆరోపణతో ఫోక్సో చట్ట కింద కూడా కేసు నమోదైంది. ఇప్పటికే బాధిత మహిళకు అండగా చిత్ర పరిశ్రమ తరుపున పరిష్కార కమిటీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంకా ఇలాంటి వేధింపులు ఎవరైనా ఎదుర్కుంటే? వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని..లేదంటే? ఆయా శాఖలకు చెందిన వారు కమిటీ ఏర్పాటు చేసి అక్కడా ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించాలని సూచించారు. ఇక జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజంగా అత్యాచారం చేసాడని నిరూపిస్తే జానీ మాస్టర్ ని వదిలేస్తానని అన్నారు.