చెవిరెడ్డికి ప్రత్యేక సౌకర్యాలు.. ఎందుకంటే?
మద్యం కేసులో అరెస్టు అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
By: Tupaki Desk | 19 Jun 2025 12:26 PM ISTమద్యం కేసులో అరెస్టు అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. లిక్కర్ స్కాం డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారని, దాదాపు రూ.250 కోట్లు చేతులు మారడంలో చెవిరెడ్డి పాత్ర ఉందంటూ ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చెవిరెడ్డితోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన వెంకటేశ్ నాయుడుని రెండు రోజుల క్రితం బెంగళూరులో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా, ఇద్దరికి జులైన 1 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
మద్యం కేసులో చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడును అరెస్టు చేసిన పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చి, కోర్టులో హాజరుపరిచేందుకు ముందు సుమారు మూడు గంటల పాటు ఇద్దరినీ సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎంతమాత్రం సహకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. చదువుకుని సంతకం చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ ను కూడా చెవిరెడ్డి చించివేశారని అంటున్నారు.
మద్యం కేసులో విచారణకు తాను సహరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని పోలీసులపై న్యాయాధికారికి చెవిరెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో తాను చెప్పిన సమాచారం కాకుండా, వారికి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఫిర్యాదు చేశారు. తనకు అనారోగ్యం ఉందని విడిచి పెట్టాలని కోరారు. అయితే చెవిరెడ్డి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కానీ, ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రిమాండులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డికి జైలులో మంచం, దిండు, దుప్పటి సమకూర్చాలని ఆదేశించింది.
