చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచిన కుర్రాడు!
అవును.. మీరు చదివింది కరెక్టే. ఒక కేసు విషయంలో ఒక కుర్రాడు చాట్ జీపీటీని వినియోగించి కేసు గెలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 14 April 2025 9:30 AM ISTఅవును.. మీరు చదివింది కరెక్టే. ఒక కేసు విషయంలో ఒక కుర్రాడు చాట్ జీపీటీని వినియోగించి కేసు గెలిచిన వైనం ఆసక్తికరంగా మారింది. మారిన టెక్నాలజీతో మనిషికి ఎంతలా సాయం చేస్తుందన్న అంశంతో పాటు.. ఏఐ జమానాలో ఈ తరహా సిత్రాలు మరెన్నో తెర మీదకు రావటం ఖాయమంటున్నారు. సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగులు.. సుదీర్ఘ వాదనలు.. వాయిదాల మీద వాయిదాలకు అవకాశం లేకుండా.. సుత్తి చెప్పకుండా సూటిగా తన వాదనలు వినిపించేందుకు వీలుగా చాట్ జీపీటీ సాయం తీసుకున్నకుర్రాడు తన కేసును గెలిచాడు. జరిమానా నుంచి తప్పించుకున్నాడు.
మొత్తంగా వకీల్ సాబ్ పాత్రను సమర్థంగా పోషించింది చాట్ జీపీటీ. కజక్ స్తాన్ లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని తీసుకొని ఆసుపత్రికి వెళుతున్నాడు. ఇదే సమయంలో తను బేస్ లైన్ క్రాస్ చేసి ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ అతడికి రూ.940 ఫైన్ విధిస్తూ చలానా ప్రిపేర్ చేశారు. అతడికి నోటీసు పంపారు.
పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎప్పుడు పోలీస్ స్టేషన్.. కోర్టు కు వెళ్లని ఈ కుర్రాడు.. తన కేసును వాదించేందుకు లాయర్లను సంప్రదించకుండా చాట్ జీపీటీ సాయం కోరాడు. ఈ కేసు విషయంలో న్యాయస్థానాన్ని సంప్రదించాలన్న సూచన చేసింది. అంతేకాదు కేసు దాఖలు చేయటానికి అవసరమైన పత్రాల్ని కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా ఆ కుర్రాడు సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో సదరు జడ్జి సైతం ఫైన్ ను రద్దు చేస్తూ తన ఆదేశాల్ని జారీ చేశారు. ఈ వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.