Begin typing your search above and press return to search.

భార్య‌ను `డార్లింగ్` అని పిల‌వొచ్చా?.. హైకోర్టు ఏం చెప్పిందంటే!

సాధార‌ణంగా భార్యా భ‌ర్త‌లు ఇరువురూ.. ప్రేమ‌గా పిలుచుకోవ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌రినొక‌రు `డార్లింగ్‌` అని సంబోధించుకుంటారు

By:  Tupaki Desk   |   3 March 2024 8:28 AM GMT
భార్య‌ను `డార్లింగ్` అని పిల‌వొచ్చా?.. హైకోర్టు ఏం చెప్పిందంటే!
X

సాధార‌ణంగా భార్యా భ‌ర్త‌లు ఇరువురూ.. ప్రేమ‌గా పిలుచుకోవ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌రినొక‌రు `డార్లింగ్‌` అని సంబోధించుకుంటారు. భ‌ర్త అయితే.. భార్య‌ను దాదాపు ఇలానే సంబోధిస్తాడు. ఇంత వ‌రకు బాగానే ఉంది. అయితే.. ముక్కు మొహం తెలియ‌ని మ‌హిళ‌ల‌ను కూడా ఎవ‌రైనా డార్లింగ్ అని పిల‌వొచ్చా? అలా పిలిచే స్వేచ్ఛ మ‌న‌కు ఉందా? అంటే.. అస‌లు ఈ రెండు విష‌యాల్లోనూ హ‌క్కులేద‌ని క‌ల‌క‌త్తా హైకోర్టు తేల్చేసింది. ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించిన‌ప్ప‌టికీ.. నిజం.

మ‌న‌కు తెలియని మ‌హిళ‌నే కాదు.. క‌ట్టుకున్న భార్య‌ను కూడా చొర‌వ తీసుకుని `డార్లింగ్` అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఇది ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ ప్ర‌కారం క్రిమిన‌ల్‌ నేరం అవుతుంద‌ని స్పష్టం చేసింది. ఓ కేసును విచారించిన క‌ల‌కత్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ జై. సేన్‌గుప్త ఇదే చెప్పారు. ``భార్య‌కు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆమేమీ.. భ‌ర్త మోచేతి నీళ్లు తాగ‌డం లేదు. మీరు ఏదంటే అది ప‌డ‌డానికి. ఆమెకు ఇష్టం ఉంటేనే డార్లింగ్ అని పిల‌వాలి. లేక‌పోతే.. పేరుతోనే సంబోధించాలి`` అని న్యాయ‌మూర్తి చెప్పారు.

కేసు ఏంటంటే..

ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌కత్తాలో దుర్గా పూజ జరుగుతుండగా ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ట్రాఫిక్‌కు ఇబ్బంది క‌లిగిస్తూ.. నారా ర‌చ్చ చేశాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో.. "డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా`` అని వ్యాఖ్యానించాడు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న కానిస్టేబుల్ కేసు పెట్టింది. ఇదికాస్తా.. కోర్టుకు వెళ్లింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వాద‌న‌ల్లో భార్యా, భ‌ర్త ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

డార్లింగ్ అన‌డం కామ‌నేన‌ని.. నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. దీనిపై రియాక్ట్ అయిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జైసేన్ అస‌లు ఎవ‌రినీ డార్లింగ్ అని పిలిచే అవ‌కాశం లేద‌న్నారు. ఇది మ‌హిళ మ‌నోభావాలకు, డిగ్నిటీకి సంబంధించిన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. `` మహిళను ఎవరు డార్లింగ్ అని పిలిచినా అది కచ్చితంగా నేరమే. అలా పిలిచిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అది నేరమే అవుతుంది. భ‌ర్తే అయినా.. అన‌కూడ‌దు. భార్య ఇష్టాయిష్టాలు తెలుసుకుని సంబోధించాలి`` అని వ్యాఖ్యానించారు.

ఇక, ఈ కేసులో నిందితుడికి రూ.10 వేల ఫైనుతోపాటు.. మూడు నెల‌ల జైలు విధించారు. మ‌రి.. డార్లింగ్.. డార్లింగ్ అంటూ రెచ్చిపోయి ప్రేమ చూపించేవారు.. జాగ్ర‌త్త ప‌డాలేమో ఆలోచించండి.