Begin typing your search above and press return to search.

పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోకపోతే అత్యాచారం అయిపోదు.. బాంబే హైకోర్టు

ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ఇష్టపూర్వకంగా శృంగారం చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు వారిద్దరి పెళ్లికి నో చెప్పారు

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:30 AM GMT
పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోకపోతే అత్యాచారం అయిపోదు.. బాంబే హైకోర్టు
X

ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ఇష్టపూర్వకంగా శృంగారం చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు వారిద్దరి పెళ్లికి నో చెప్పారు. తన తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించటం లేని కారణంగా తాను పెళ్లి చేసుకోలేనని ఆ అబ్బాయి తేల్చేశాడు. ఈ నేపథ్యంలో సదరు ప్రియురాలు కోర్టును ఆశ్రయించింది. అతడు తనను నమ్మించి అత్యాచారం చేశాడంటూ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను నాగపూర్ బెంచ్ కొట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఈ కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్య చేసింది. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే ప్రేమికుడేం చేస్తాడన్నది బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం.. పెళ్లి చేసుకుంటానని ఇరువురు అంగీకారంతో జరిగిన శృంగారం అత్యాచారం కాదన్నది మాత్రమే అన్నది మర్చిపోకూడదు. ఈ సందర్భంగా యువతి దాఖలు చేసిన పిటిషన్ కు సదరు యువకుడు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

తాను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఉన్నట్లుగా పేర్కొన్న అతడు.. ఇద్దరం శృంగారంలో పాల్గొన్నామని.. అయితే తన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదన్నారు. ఈ కారణంతోనే మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని కోర్టుకు వెళ్లడించారు. ఈ వాదనను జస్టిస్ ఎం.డబ్ల్యూ చాంద్ వానీ ఏకసభ్య ధర్మాసనం ఓకే చేసింది. పెళ్లి చేసుకుంటానన్న హామీని మాత్రమే నిందితుడు ఉల్లంఘించాడని గుర్తు చేసింది.

పెళ్లి చేసుకోవటానికి శారీరక సంబంధం పెట్టుకోవటాన్ని ఒక సాకుగా వాడుకోలేదన్న కోర్టు.. ఇచ్చిన మాటను ఉల్లంఘించటం.. హామీని నెరవేర్చకపోవటం మధ్య వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. నిందితుడు తన మాటను నెరవేర్చలేదని.. ముందు నుంచే అతడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్లుగా చెబుతూ.. 'తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కాబట్టి అతను అత్యాచారం చేశాడని చెప్పలేం' అని పేర్కొంది. ఇక్కడ నాగపూర్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల్ని చూస్తే.. అత్యాచారం చేశాడన్న ఆరోపణను మాత్రమే కొట్టేసిందన్నది మర్చిపోకూడదు.