అమెరికా చిన్నారులను ఇండియాలో దత్తత తీసుకోలేరు
అమెరికా పౌరసత్వం ఉన్న ఓ చిన్నారిని భారత్‌కు చెందిన దంపతులు దత్తత తీసుకోవడానికి చేసిన ప్రయత్నం బాంబే హైకోర్టులో నిరాశను మిగిల్చింది.
By: Tupaki Desk | 18 July 2025 5:00 AM ISTఅమెరికా పౌరసత్వం ఉన్న ఓ చిన్నారిని భారత్‌కు చెందిన దంపతులు దత్తత తీసుకోవడానికి చేసిన ప్రయత్నం బాంబే హైకోర్టులో నిరాశను మిగిల్చింది. విదేశీ పౌరసత్వం కలిగిన పిల్లలను భారతీయ చట్టాలు దత్తతకు అనుమతించవని స్పష్టం చేస్తూ, హైకోర్టు ఆ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే, భారత్‌కు చెందిన ఓ దంపతులకు అమెరికాలో నివసించే వారి బంధువులకు 2019లో ఒక మగబిడ్డ జన్మించాడు. పుట్టిన కొద్ది నెలలకే ఆ చిన్నారిని భారత్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ బాలుడు ఈ దంపతులతోనే పెరుగుతున్నాడు. చట్టబద్ధంగా అతడిని దత్తత తీసుకోవాలని ఆ దంపతులు భావించారు. అయితే దత్తత ప్రక్రియ కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA)లో నమోదు చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నం విఫలమైంది. భారత దత్తత చట్టాలు విదేశీ పౌరులైన పిల్లలను భారతీయులు దత్తత తీసుకోవడానికి అనుమతించవని CARA స్పష్టం చేసింది. దీంతో ఆ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
హైకోర్టు తీర్పు:
జస్టిస్ రేవతి మోహితే డెరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. "జువెనైల్ జస్టిస్ యాక్ట్ లేదా CARA మార్గదర్శకాల్లో విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలను వారి బంధువులు దత్తత తీసుకునే విషయమై ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు" అని ధర్మాసనం పేర్కొంది. అలాగే "అమెరికా చట్టాల ప్రకారం ముందు దత్తత ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాతే భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడి చట్టాలను అనుసరించాలి" అని సూచించింది. కోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి దత్తతకు అనుమతించడాన్ని కూడా నిరాకరించింది.
ఈ తీర్పుతో ఒక విషయం స్పష్టమవుతోంది. విదేశీ పౌరసత్వం ఉన్న చిన్నారిని భారతీయులు దత్తత తీసుకోవాలంటే, ముందుగా ఆ దేశ చట్టాలను అనుసరించి, అన్ని విధానాలను పూర్తిచేయాల్సి ఉంటుందని అర్థమవుతోంది..
ఈ కేసు తదుపరి దత్తతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. మానవతా దృక్పథంతో చూసినా, చట్టపరంగా స్పష్టత లేనప్పుడు న్యాయ వ్యవస్థ కూడా నిర్దిష్టంగా స్పందించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలియజేస్తుంది.
