Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. ఆ సీఎంకు బెయిలొచ్చింది.. 50 రోజులకు బయటకు.

మద్యం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసినా.. కేజ్రీ స్పందించలేదు

By:  Tupaki Desk   |   10 May 2024 9:24 AM GMT
హమ్మయ్య.. ఆ సీఎంకు బెయిలొచ్చింది.. 50 రోజులకు బయటకు.
X

దాదాపు 50 రోజులు.. సీఎంగా ఉండగానే అరెస్టయిన పేరు.. అంతకుముందు ఎంతో డ్రామా.. తర్వాత బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు.. అనారోగ్య కారణాలను చూపి బెయిల్ కోసం ఎత్తులు వేస్తున్నారనే విమర్శలు.. అటు తమ అధినేత జైల్లో ఉండడంతో ఎన్నికలపై ప్రభావం పడుతోందని పార్టీ వర్గాల ఆవేదన.. మధ్యలో కోర్టు విచారణలు.. ఇవన్నీ పూర్తయ్యాక ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. 50 రోజుల తర్వాత ఆయన బయటి ప్రపంచాన్ని చూడనున్నారు.

మద్యం విధానం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది.. 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. కాగా, మద్యం స్కాంలో మనీలాండరింగ్‌ కింద కేజ్రీని ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం జూన్‌ 1 వరకు బెయిల్ వచ్చింది.

మద్యం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసినా.. కేజ్రీ స్పందించలేదు. దీంతో దర్యాప్తు సంస్థ అతడిని అదుపులోకి తీసుకుంది. అయితే, కేజ్రీ పదవికి రాజీనామా చేయలేదు. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. కాగా, తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ప్రచారానికి..

కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి కోర్టు ఓకే చెప్పడం ఆప్ నకు పెద్ద ఊరట. ఢిల్లీ, పంజాబ్ లో ఆ పార్టీనే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ కేజ్రీ పెద్దఎత్తున ప్రచారం చేయడం ఖాయం. 7 సీట్లున్న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 25న పోలింగ్ ఉంది. పంజాబ్ లో జూన్ 1 ఎన్నికలున్నాయి.