నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో కుదరదు: సుప్రీంకోర్టు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 25 July 2025 2:01 PM ISTఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాలని కోరుతూ.. ప్రొఫెసర్, ప్రముఖ జర్నలిస్టు, వ్యాఖ్యాత.. పి. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత మూడేళ్ల కిందట.. జమ్ము కశ్మీర్‌ను విభజించి.. నియోజకవర్గాలను ఏర్పాటు చేశారని.. అదే తరహా.. విభజన చట్టం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాలను, పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని ఆయన కోర్టును కోరారు.
అయితే.. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారించిన సుప్రీంకోర్టు.. పునర్విభజన చట్టంలోని 26 సెక్షన్‌ను సమర్థిస్తూనే.. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. జమ్ము కశ్మీర్‌కు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. ఆ విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ విభజన చేయాలని కోరడం సమంజసం కాదని పేర్కొంది. అంతేకాదు.. 2026 లో జనాభా లెక్కలు చేయనున్నారని.. అప్పటి వరకు వేచి చూడాలని సూచించింది.
ఇలాంటి పిటిషన్లను విచారించడం వల్ల.. మరిన్ని రాష్ట్రాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జనాభా లెక్కల ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నట్టు తెలిపిం ది. అప్పటి వరకు వేచి చూడాలని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం.. నియోజకవర్గాలను పునర్విభజించాలని పేర్కొన్నా.. దానికి కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది.
జమ్ము కశ్మీర్‌లో విబజన చేసినట్టు ఏపీ, తెలంగాణలో చేయడం సాధ్యం కాదని.. అలా చేయకపోవడం వల్ల వివక్ష చూపినట్టు కూడా కాదని పేర్కొంది. ఈ మేరకు పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇక, రాష్ట్ర విబజన ప్రకారం.. పది సంవత్సరాల్లోనే రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. అయితే.. 2021లో చేపట్టాల్సిన జనాభా గణనను వాయిదా వేయడంతో ఇది సాధ్యం కాలేదు.
