Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ అడ్డంకులు.. అయినా ఎన్నికలే అంటున్న ప్రభుత్వం, ఇప్పుడెలా?

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండగా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటం వల్ల బీసీ రిజర్వేషన్లు పెంపుతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2026 8:27 PM IST
రిజర్వేషన్ అడ్డంకులు.. అయినా ఎన్నికలే అంటున్న ప్రభుత్వం, ఇప్పుడెలా?
X

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సందేహాలకు సమాధానాలు లభించడం లేదని అంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండగా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటం వల్ల బీసీ రిజర్వేషన్లు పెంపుతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టు కూడా బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించింది. దీంతో బంతి సుప్రీంకి వెళ్లింది. కానీ, అక్కడ కూడా 34 శాతానికి అనుకూలంగా తీర్పు వచ్చే పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఎలా ముందుకు వెళుతుందనేదే ఆసక్తి రేపుతోందని అంటున్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపును రద్దు చేయడంతోపాటు ఎన్నికలను ఆరు వారాల్లోగా నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం కూడా ఈ నెలలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలుపైనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు అభ్యంతరంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వరుస సెలవులతో సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఈ మేరకు ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్టే లభిస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీం కోర్టే గతంలో తీర్పులు ఇవ్వడంతో ఇప్పుడు అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి వాదనలు వినిపిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

హైకోర్టులోనే విఫలమైన ప్రభుత్వ వాదనలు, సుప్రీం కోర్టును మెప్పించగలవా? అంటూ న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసినా, 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సుప్రీం అనుకూలంగా నిర్ణయం తీసుకునే విషయంలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.

బీసీ రిజర్వేషన్లపై ఒకవైపు కోర్టుల్లో పోరాడుతున్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో ఎన్నికలను ప్రారంభించాలని భావిస్తోంది. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని అంటున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకు స్థానిక సంస్థలపై పెత్తనం చెలాయించే అవకాశం లభించడంతో కేడర్ కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని చెబుతున్నారు. దీంతో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కూటమిలోని పార్టీలతో కలిసి పలుమార్లు చర్చించింది. ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని, రెడీ అవ్వాలని కేడర్ కు సంకేతాలు పంపింది. అయితే నిన్నటి వరకు అంటే అక్టోబరు 1వ తేదీ వరకు హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల తేదీలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావించారు. అనూహ్యంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు బంతి సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీం నిర్ణయంపైనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, విచారణ చేపడితే కనీసం రెండు మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వం భావించినట్లుగా ఈ నెలలో లోకల్ ఫైట్ ఉండకపోవచ్చునని అంటున్నారు. మొత్తానికి సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఏం జరగనుందనే ఏకైక అంశమే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.