Begin typing your search above and press return to search.

లిక్కర్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో సిట్ అత్యవసర పిటిషన్

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది.

By:  Tupaki Desk   |   7 Sept 2025 12:21 PM IST
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో సిట్ అత్యవసర పిటిషన్
X

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసిందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన నిందితులకు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. మరోవైపు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిలుతో నిందితులు ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

సిట్ హౌస్ మోషన్ పిటిషన్ వేయడంతోపాటు నిందితుల విడుదల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. శనివారమే బెయిలు మంజూరు అయినప్పటికీ నిబంధనలు అనుసరించి నిందితుల విడుదల ఆదివారం ఉదయం వరకు వేచిచూడాల్సివచ్చింది. అయితే ఉదయాన్ని కోర్టు నిబంధనలు అన్నీ పూర్తి చేసినా, విడుదలకు మూడు గంటలపాటు ఆలస్యం చేశారని నిందితుల బంధువులు, వైసీపీ నేతలు జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా నిందితుల విడుదలను జాప్యం చేశారని, దీనిపై సోమవారం కోర్టులో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఒకవైపు సిట్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, నిందితుల విడుదల జాప్యం జరగడంపై నిందితుల బంధువులు, వైసీపీ నేతలు టెన్షన్ పడ్డారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను జైలు అధికారులు తొక్కిపెడుతున్నారని మీడియాలో హడావుడి చేశారు. ఈ క్రమంలో నిందితులు బయటకు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్ పిటిషన్ తో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలు రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

బెయిలుపై విడుదలైన ముగ్గురు నిందితులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో ఈ విషయంలో ప్రభుత్వం పంతానికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ దశలో నిందితులకు బెయిలు మంజూరైతే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సిట్ వాదిస్తోంది. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సివుంది.