అరెస్టు చేయాలంటే చేయొచ్చు.. జగన్ జట్టుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశిస్తే అక్కడా భంగపాటే ఎదురైంది
By: Tupaki Desk | 5 May 2025 6:45 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ టీమ్ కు కాలం కలిసిరావడం లేదు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశిస్తే అక్కడా భంగపాటే ఎదురైంది. అంతేకాకుండా అరెస్టు చేయాలంటే చేసుకోవచ్చు అంటూ పోలీసులకు లైన్ క్లియర్ చేయడంతో సీనియర్ ఐఏఎస్ అధికారితోపాటు మరో ఇద్దరి పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఎక్కువవుతోంది.
లిక్కర్ స్కాంలో నిందితులు తమ పేర్లు చెప్పడంతో అరెస్టు భయంలో ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వీరిని ఇంకా నిందితుల జాబితాలో చేర్చకపోయినా, ఏ1 నిందితుడి రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లు ఉండటంతో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాదన తెలియజేస్తే గానీ, ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోలేమంటూ చెప్పిన హైకోర్టు కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా అంతవరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
దీంతో ఐఏఎస్ అధికారి ధనుంజరెడ్డితోపాటు మిగిలిన ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో విచారణ పెండింగులో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని స్పష్టం చేస్తూ కేసును 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామంతో పిటిషనర్లు ఆందోళనకు గురవుతున్నారంటున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాంపై చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిందితులను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆయన వాంగ్మూలం ప్రకారం వైసీపీలో కీలక నేతలతోపాటు గత ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని టాక్ వినిపిస్తోంది.
ఈ నెల 7న హైకోర్టు విచారణ వరకు అయినా అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్లు కోరినా, సుప్రీం తిరస్కరించింది. రెండు రోజులు పాటు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధి, అధికారాల ప్రకారం అరెస్టు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. మరోవైపు 7వ తేదీ విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కేసు మెరిట్స్ పై తాము ఎలాంటి కామెంట్స్ చేయమని స్పష్టం చేసిన ధర్మాసనం.. నిర్ణయాధికారం హైకోర్టుకే వదిలేసింది.
