పలచనవుతున్న పార్టీలు.. తీరు మారుతుందా ..!
ఏ రాజకీయ పార్టీలకైనా కొన్ని నిబద్ధతలు.. నిబంధనలు ఉండాలి. లేకపోతే.. ఎలా ఉంటుందో.. చెప్పడాని కి తాజాగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అద్దం పడతాయి.
By: Tupaki Desk | 22 May 2025 3:00 AM ISTఏ రాజకీయ పార్టీలకైనా కొన్ని నిబద్ధతలు.. నిబంధనలు ఉండాలి. లేకపోతే.. ఎలా ఉంటుందో.. చెప్పడాని కి తాజాగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అద్దం పడతాయి. హైకోర్టు స్థాయిని సెకండ్ క్లాస్ జ్యూడీయల్ మేజిస్ట్రేట్ కోర్టుకు దిగజార్చేస్తున్నారంటూ.. తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలకు చురకలు అంటించడమే కాదు.. కర్ర కాల్చి వాత పెట్టిన విధంగనే ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్నే కాదు.. గత ప్రభుత్వాన్ని కూడా.. కోర్టు తప్పుబట్టింది.
ప్రతి చిన్న విషయానికీ.. కోర్టుకు రావడం పరిపాటిగా మారిందని కూడా హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇది చిన్న విషయం కాదు. హైకోర్టు స్థాయిలో రాజకీయాలు మాట్లాడడం.. పార్టీలపై నిప్పులు చెరగడం అసాధారణ విషయం. దీనిపై పార్టీలు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలోను, ఇప్పుడు కూడా.. అదికార పక్షంలో ఉన్న పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేసుకున్న తీరును కోర్టు తప్పుబట్టింది.
వాస్తవానికి ఈ తరహా పరిణామాలను వైసీపీ హయాంలోనే బీజం పడ్డాయన్నది టీడీపీ నాయకుల మాట. కానీ.. ఇప్పుడు వాటికి మించిన విధంగా దాడులు జరుగుతున్నాయని, వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తు న్నారన్నది ఆ పార్టీ చెబుతున్న వాదన. వెరసి మొత్తంగా ఏ చిన్న విషయంపైనైనా కూడా.. హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. తిరువూరు మునిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని.. వైసీపీ నాయకులు పోలీసులను కోరారు.
వారు తిరస్కరించడంతోపాటు.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో కోర్టును ఆశ్రయించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగానే కోర్టు ఇరు పార్టీలను కూడా.. తలంటింది. సమన్వయం.. సహకారం లేకపోతే.. ఏ వ్యవస్థలో అయినా.. ఏ ప్రభుత్వంలో అయినా తిప్పలు తప్పవు.. అని చెప్పడానికి ఇది ఉదాహరణే కాదు.. పెద్ద గుణ పాఠం కూడా. రాజకీయాలు శాస్వతమే.. కానీ, ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపై పార్టీలు గుర్తెరగాల్సి ఉంది. లేకపోతే.. మున్ముందు ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
