Begin typing your search above and press return to search.

హైకోర్టులో వైసీపీకి షాక్.. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికపై సెన్సేషన్ డెసిషన్

అయితే ఈ విషయంపై నేరుగా హైకోర్టుకు రావడంతో అనుకూల తీర్పు రాలేదని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2025 5:54 PM IST
హైకోర్టులో వైసీపీకి షాక్.. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికపై సెన్సేషన్ డెసిషన్
X

ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని ఈ నెల 12న జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడంతోపాటు రీపోలింగ్ నిర్వహణకు ఆదేశించాలని వైసీపీ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి హైకోర్టు తీర్పుతో మరింత దెబ్బకొట్టినట్లైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ రీపోలింగ్ జరగాలని రెండు రోజులుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ విషయంపై నేరుగా హైకోర్టుకు రావడంతో అనుకూల తీర్పు రాలేదని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పులివెందుల్లో 15 కేంద్రాల్లో, ఒంటిమిట్టలో 30 చోట్ల పోలింగ్ జరిగింది. అయితే మొత్తం అన్ని కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, రీపోలింగ్ అంశం తమ పరిధిలోది కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, పులివెందుల, ఒంటిమిట్టలో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి సుమారు 6 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ లతారెడ్డి ప్రత్యర్థులు ఎవరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 12,780 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. ఈ రెండు చోట్ల 11 మంది చొప్పున పోటీపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

అయితే పులివెందుల, ఒంటిమిట్టలో అసలు ఎన్నికలే జరగలేదని వైసీపీ వాదిస్తోంది. తమ ఏజెంట్ల, ఓటర్లను పోలింగ్ బూతుల వద్దకు రానీయకుండా అధికార పార్టీ ఏకపక్షంగా ఓటింగ్ జరుపుకుందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ గెలుపును తాము అంగీకరించమని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీకి దమ్ముంటే పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వీడియోలు, పోలింగ్ కేంద్రాల ఆవరణలో సీసీ కెమెరా పుటేజ్ బయటపెట్టాలని సవాల్ చేస్తున్నారు. స్థానికుల ఓటరు స్లిప్పులను తీసుకుని టీడీపీ నేతలు దౌర్జర్యంగా ఓటు వేసుకున్నారని ఆరోపించారు. అయితే వీరి వాదనకు కోర్టులో మద్దతు లభించకపోవడంతో ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ ఈ విజయాన్ని ఘనంగా చాటుకుంటోంది.