వైసీపీ ఎంపీ పిటిషన్ కు తలంటిన ఏపీ హైకోర్టు
తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By: Garuda Media | 12 March 2026 10:34 AM ISTతిరుపతి ఎంపీ గురుమూర్తికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు.. ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం తలంటింది. ప్రపంచంతో పోటీ పడొద్దా? ప్రోత్సహాకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎవరు పెడతారు? అని ప్రశ్నించటంతో పాటు.. ప్రపంచ దేశాలు.. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో నెలకొన్న పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా? అని పేర్కొంటూ.. గురుమూర్తి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన గురుమూర్తి తరఫు న్యాయవాదికి ధర్మాసనం పలు ప్రశ్నల్ని సంధించింది.
విశాఖపట్నంలో పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం భూముల కేటాయింపులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. విశాఖలో పెట్టుబడులు పెట్టే పలు పరిశ్రమలకు.. గూగుల్ డేటా సెంటర్ కు భూముల కేటాయింపు.. ఎకరా 99 పైసలకు భూములు ఎలా ఇస్తారు? ఈ కేటాయింపుపై పారదర్శకత లేదంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపులు..రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని తన పిటిషన్ లో కోరారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వైసీపీ ఎంపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో సాధారణంగా కోర్టులు జోక్యోం చేసుకోవు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి పిటిషన్ వేయటమా? పరిశ్రమలకు ప్రోత్సహాకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు? ప్రపంచ దేశాలతో.. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. భూములు కేవలం వేలం ద్వారా మార్కెట్ ధరలకు కేటాయిస్తే.. కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు.. ఐటీ పారిశ్రామిక రంగాలకు రాయితీలు అవసరం. ప్రజా ప్రయోజనాల పేరుతో ఒక్కోసారి పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు వేయటం అలవాటైంది’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణలో భాగంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
