Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళ్లే అర్చకులు పూజలు చేయకూడదా! హైకోర్టు ఏం చెప్పింది?

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు విజయవాడ దుర్గ గుడి గర్భాలయంలో ప్రవేశించకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   7 April 2026 10:00 PM IST
విదేశాలకు వెళ్లే అర్చకులు పూజలు చేయకూడదా! హైకోర్టు ఏం చెప్పింది?
X

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు విజయవాడ దుర్గ గుడి గర్భాలయంలో ప్రవేశించకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై అర్చకులు, దేవాలయ అధికారులు తీవ్ర మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశమై తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో ఎలా నడుచుకోవాలన్న అంశమై న్యాయ సలహా కోసం సీనియర్ న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ సూచనలతో దుర్గమ్మ పూజలు చేయడానికి తాము అమెరికా వెళ్లామని, అదే నేరంగా పరిగణిస్తే ఎలా? అంటూ అర్చకులు ప్రశ్నిస్తున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులను తాము కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వేరే గత్యంతరం లేదని అధికారులు చెబుతుండటంతో ఈ అంశం హాట్ డిబేట్ గా మారింది.

విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు విదేశీ ప్రయాణం చేస్తున్నారని, విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత గర్భాలయంలో ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతూ, ఆగమశాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్లివచ్చిన వారు గర్భాలయంలో పూజలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ శ్రీచక్ర నవావరణార్చన పారాయణదారు డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్య సోమయాజి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లిన వారు, సంప్రదాయాలకు విరుద్ధంగా జుత్తు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదని ఆ పిటిషన్ లో తెలిపారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు విదేశీయానం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించానికి వీల్లేదని, ఈ విషయంలో శృంగేరి పీఠం ప్రామాణికాన్ని అమలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దుర్గ గుడి ఆలయ అర్చకులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కొందరు కావాలనే తమను ఇబ్బంది పెట్టేందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఇంతకుముందు ఈవోగా పనిచేసిన నరసింగరావు, పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలతో తాము అమెరికాలో దుర్గమ్మ పూజలకు వెళ్లినట్లు చెబుతున్నారు.

ఇక కొందరు స్వామీజీలు, మఠాధిపతులు విదేశాల్లో హిందూ ధర్మ ప్రచారం చేసి వస్తున్నారని, వారు ఆలయాల సందర్శన సమయంలో గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వారికి లేని అభ్యంతరం తమపై విధించడం ఏంటని అర్చకులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల తమకు గౌరవం ఉందని, అయితే గర్భాలయంలో తమ విధులను హక్కుగా భావిస్తున్నామని హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుని అప్పీలు చేస్తామని కొందరు అర్చకులు చెబుతున్నారు. కాగా, హైకోర్టు తీర్పుతో దుర్గ గుడిలో దాదాపు 10 మంది అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశం కోల్పోయారని చెబుతున్నారు.