ఏపీ హైకోర్టు కీలక ఆదేశం.. మతం మారిన రోజే ఎస్సీ హోదా మిస్
రిజర్వేషన్ కు సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది ఏపీ హైకోర్టు.
By: Tupaki Desk | 2 May 2025 8:30 AMరిజర్వేషన్ కు సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది ఏపీ హైకోర్టు. తమ ముందుకు వచ్చిన ఒక కేసు విచారణను ముగించిన హైకోర్టు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఎస్సీ వ్యక్తులు ఎవరైనా క్రైస్తవంలోకి మారితే.. మారిన రోజే అప్పటివరకు వారికి ఉన్న ఎస్సీ హోదా కోల్పోతారని స్పష్టం చేసింది. అలాంటి వారు ఎవరైనా సరే.. ఎస్సీ.. ఎస్టీ చట్టం కింద రక్షణ పొందటం ఉండదని తేల్చేసింది. ఒక చర్చి పాస్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎస్సీ.. ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది.
అంతేకాదు.. చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. వారిపై ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని చెప్పి ఏపీ హైకోర్టు.. సదరు కేసును కొట్టేసింది. దీనికి సంబంధించిన ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తనను కులం పేరుతో దూషించి.. దాడి చేసినట్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
ఈ ఫిర్యాదులో తమ గ్రామానికి చెందిన రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు మీద ఎస్సీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ.. ఎస్టీ కోర్టులో పెండింగ్ ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో పలు అంశాల్ని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టు ముందుకు తీసుకొచ్చారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్ గా పని చేస్తున్నారని.. ఈ విషయాన్ని కంప్లైంట్ లోనే పేర్కొన్న విషయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు.. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ.. ఎస్టీ చట్టం వర్తించదన్న విసయాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాజ్యాంగం ఆర్డర్ 1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదు. ఆ మతాన్ని స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. క్రైస్తవాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ..ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకొని కేసును కొట్టేయాలి’’ అంటూ తన వాదనను వినిపించారు.
వీరి వాదనకు పాస్టర్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపించారు. తన పిటిషనర్ ను ఎస్సీగా గుర్తిస్తూ తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు.అయితే.. ఈ వాదనను పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం.. మతం మారిన వారికి ఎస్సీ.. ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని.. నిందితులపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావంటూ తీర్పు ఇచ్చారు.