కూటమి సర్కారుకు 'హైకోర్టు' హెచ్చరికలు!
ఏపీలోని కూటమి సర్కారుకు హైకమాండ్ ఏది? అంటే.. మూడు పార్టీలకు మూడు హైకమాండ్‌లు ఉన్నా యి తప్ప.. మూకుమ్మడిగా మూడు పార్టీలకూ కలిపి ఒక హైకమాండ్ అంటూ ఏమీ లేదు.
By: Tupaki Desk | 2 Jun 2025 2:00 AM ISTఏపీలోని కూటమి సర్కారుకు హైకమాండ్ ఏది? అంటే.. మూడు పార్టీలకు మూడు హైకమాండ్‌లు ఉన్నా యి తప్ప.. మూకుమ్మడిగా మూడు పార్టీలకూ కలిపి ఒక హైకమాండ్ అంటూ ఏమీ లేదు. బహుశ ఈ క్రమం లోనే హైకోర్టు జోక్యం చేసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. వరుసగాగత వారం రోజుల తీర్పులు, ఆదేశాల ను గమనిస్తే.. కూటమి సర్కారు ఒకింత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే.. గతంలో వైసీపీకి ఎదురైన పరాభవం ఏర్పడేందుకు పెద్దగా సమయం పట్టదని కూడా హెచ్చరిస్తున్నారు.
గత వారం రోజుల్లో సుమారు 8 కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఈ 8 కేసుల్లోనూ ప్రభుత్వాన్ని కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కొన్నింటిలో అయితే. పరోక్షంగా హెచ్చరించింది. ముఖ్యంగా పోలీసులు నమోదు చేస్తున్న కేసులను తూర్పారబట్టింది. అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలో సర్కారు తరఫున కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగట్టింది. ప్రభుత్వ అనుకూల వర్గాలకు ఇవి రుచించకపోవచ్చు. కానీ.. కోర్టు తీర్పులను వారు కాదనలేరు కదా! అనే టాక్ వినిపిస్తోంది.
''చట్టం అంటూ.. ఒకటి ఉంది.. దాని ప్రకారం నడుచుకోవాలని.. మీకు తెలియదా?'' అంటూ.. పోలీసుల పై హైకోర్టు నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా కేసులను దేశ ద్రోహంగా.. దొంగతనం, దొమ్మీ కేసులుగా పేర్కొనడాన్ని తప్పుబట్టింది. అలాగే.. విశాఖ పోలీసులు తీసుకువచ్చిన కొత్త నిబంధనలను రాత్రికి రాత్రి కొట్టేసింది. అక్కడ ప్రభుత్వ సూచనలు అంటూ.. పోలీసులు భూముల పంచాయతీలు తేల్చేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. సమాధానం చెప్పాలని సర్కారును నిలదీసింది.
ఇక, వ్యవసాయ సంఘాలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల విషయంలో నాయకులను బలవంతం గా రాజీనామాలు చేయాలంటూ.. కలెక్టర్లు ఇస్తున్న తాఖీదులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇది.. రాజకీయ ప్రతీకారంతో చేస్తున్న చర్చగా పేర్కొంది. ఇది ప్రభుత్వానికి రాజకీయాలను అంటించుకునే చర్యగా అభివర్ణించింది. ఇలా చేయడానికి వీల్లేదని.. నామినేటెడ్ పదవులను వారి కాలం ఉన్నంత వరకు కొనసాగించి తీరాలని తీర్పు చెప్పింది. అలా చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇలా.. 8 కేసుల్లో సర్కారు సహా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టడం.. కూటమికి ఒక హెచ్చరిక.
