ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి షాక్.. కోర్టు ధిక్కారణ కేసులో జైలు!
ఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు.
By: Tupaki Desk | 8 Dec 2025 12:38 AM ISTఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు. గత నెల 29నే ఈ తీర్పు వెలువడగా, ఉత్తర్వుల ప్రతి తాజాగా బయటకి వచ్చింది. అయితే హైకోర్టు తీర్పును ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. మాజీ వీసీ ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాదుల వినతి మేరకు తీర్పు అమలును ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 22లోగా హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసుకోవాల్సివుంటుంది. ఆలోగా స్టే మంజూరు అయితేనే ఆయనకు ఉపశమనం లభిస్తుంది. లేని పక్షంలో డిసెంబరు 22న హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల్సివుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏయూ వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని న్యాయమూర్తి భావించారు. ఆయన వీసీ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాతే హైకోర్టు ఆదేశాలు అమలయ్యాయని, ఇది తీవ్రమైన చర్యగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రసాదరెడ్డిని ఉపేక్షిస్తే న్యాయపాలనకు నష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఉత్తర్వులు అంటే ప్రసాదరెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ, మొండివైఖరి అవలంబించారని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలి న్యాయపాలనకు తీవ్ర నష్టమని తెలిపింది.
అసలేం జరిగిందింటే..?
ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల బోటనీ విభాగంలో బోదనా సిబ్బందిగా నూకన్నదొర 2006 జులైలో నియమితులయ్యారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఒప్పంద) కొనసాగారు. 17 ఏళ్ల పాటు సేవలు అందించారు. నూకన్నదొరను విధుల నుంచి తొలగిస్తూ ఏయూ వీసీ 2022 నవంబరు 18న ఉత్తర్వులిచ్చారు. 2022 మే నుంచి చెల్లించాల్సిన జీతం బకాయిలను నిలిపివేశారు. తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నూకన్నదొర 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2023 మార్చి 7న విచారణ జరిపిన న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిటిషనర్ ను కొనసాగించాలని నిర్దిష్టకాలానికి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి వీసీ ప్రసాదరెడ్డిపై నూకన్నదొర హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగా ప్రసాదరెడ్డి కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గత నెల 20న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఒకసారి కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత దానిని యథాతథగా అమలు చేయడమే అధికారుల విధి అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
