Begin typing your search above and press return to search.

పేరెంట్స్ కి ఇష్టం లేని పెళ్లి... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఇంట్లోని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే జంటలకు సంబంధించి తాజాగా అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.

By:  Tupaki Desk   |   17 April 2025 3:00 PM IST
Allahabad high court On Love Marriage Security
X

ఈ పెద్దోళ్లున్నారే మా ప్రేమను ఎప్పటికీ అర్ధం చేసుకోరు.. అనేది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్! ప్రేమించుకున్న మెజారిటీ జంటలు బయటకో, లోలోపలో ఈ మాట అనుకుంటూనే ఉంటారని అంటారు. ఈ సమయంలో.. ఇలా తల్లితండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటలు పోలీస్ సెక్యూరిటీ కోరడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... తల్లితండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటల రక్షణ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేరెంట్స్ కు ఇష్టం లేదనే ఓకే ఒక్క కారణం చూపించి పోలీసు సెక్యూరిటీ కోరలేరని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ సమయంలో జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని న్యాయస్థానం సూచించింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదురించి తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని.. తమ వైవాహిక జీవితంలో ఇతరులు ఎవ్వరూ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల శ్రేయ కేసర్వానీ, ఆమె భర్త అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... కేవలం తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నంత మాత్రాన్న అలాంటి జంటకు పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని.. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టూ ఇదే తరహా కేసులో తీర్పునిచ్చిందని తెలిపింది.

పైగా వీరి పిటిషన్ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు తీవ్రమైన ముప్పు పొంచి లేదని అర్థమవుతోందని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తాజా పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని.. వీరి జీవితానికి ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఒక వేళ నిజంగా పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ముప్పు ఉండే కేసులకు తాము భద్రత కల్పిస్తామని.. కానీ, అలాంటి ప్రమాదం లేనప్పుడు.. సమాజాన్ని ఎదుర్కోవడానికి దంపతులిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. వీరి పిటిషన్ ను కొట్టివేసింది!