Begin typing your search above and press return to search.

ముంబై పేలుళ్ల కేసు..శిక్షపడిన 12 మంది నిర్దోషులే..కోర్టు సంచలన తీర్పు

ముంబై అంటేనే లోకల్ రైళ్లు. అక్కడి ప్రజల జీవనం అంతా వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క రోజు లోకల్ రైల్ సర్వీసులు ఆగిపోతే ముంబై స్తంభించిపోతుంది.

By:  Tupaki Desk   |   21 July 2025 1:06 PM IST
ముంబై పేలుళ్ల కేసు..శిక్షపడిన 12 మంది నిర్దోషులే..కోర్టు సంచలన తీర్పు
X

'ముంబై దాడి’ అనగానే తొందరగా గుర్తొచ్చేది 26/11. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధానిపై 2008లో చేసిన దారుణ దాడి ఇది. దేశం మొత్తాన్నే కదిలించింది ఆ సంఘటన. ఎంతగానంటే.. ఇటీవలి పెహెల్గాం ఉదంతం తరహాలో. అయితే 2008 నాటి కంటే ముందే ముంబై ఓసారి భీకరమైన దాడికి గురైంది. అది 2006లో.

ముంబై అంటేనే లోకల్ రైళ్లు. అక్కడి ప్రజల జీవనం అంతా వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క రోజు లోకల్ రైల్ సర్వీసులు ఆగిపోతే ముంబై స్తంభించిపోతుంది. అలాంటి లోకల్ రైళ్లను టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. సరిగ్గా 19 ఏళ్ల కిందట... 2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్ లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 1993 పేలుళ్ల తర్వాత ఈ స్థాయిలో ముంబై టార్గెట్ కావడం అప్పుడే. దీంతో దేశమంతా ఉలిక్కిపడింది. 800 మందిపైగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.

కాగా, 2015 అక్టోబరులో 12 మందిని దోషులుగా తేల్చింది. బాంబులు పెట్టారన్న అభియోగాలపై ఐదుగురికి మరణ శిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు జీవిత ఖైదు విధించింది. వీరిలో కమల్ అన్సారీ 2021లో కొవిడ్ తో నాగపూర్ జైల్లో చనిపోయాడు.

రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో సోమవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్దోషులుగా తేల్చేందుకు కారణం.. ప్రాసిక్యూషన్ అభియోగాలను నిర్ధారించడంలో విఫలం కావడమేనని పేర్కొంది. అయితే, వీరిలో కొందరు ఉరిశిక్షలు పడిన ఖైదీలు కూడా ఉన్నారు.

బాంబు పేలుళ్ల ఘటనపై ప్రత్యేక కోర్టు తమను దోషులుగా నిర్ధారించడంపై నిందుతులు హైకోర్టుకు వెళ్లారు. వీటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది. 2015 నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉంది. పలు అభ్యర్థనల తర్వాత గత ఏడాది జూలైలో రోజువారీ విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ఏడాది విచారణ అనంతరం సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు తీరును తప్పుబట్టింది.