జుకర్‌బర్గ్ ఆకస్మిక ప్రవేశం: ట్రంప్ మిలిటరీ భేటీలో కలకలం.. బయటకు పంపించేశారు
భద్రతా అనుమతి లేకుండానే ఓవల్ ఆఫీస్‌లోకి వచ్చిన జుకర్‌బర్గ్‌ను సిబ్బంది మర్యాదపూర్వకంగా బయటకు పంపించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
By: Tupaki Desk | 3 July 2025 11:51 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఓవల్ ఆఫీస్‌లో జరిగిన అత్యంత రహస్య మిలిటరీ సమావేశం ఊహించని సంఘటనకు వేదికైంది. అనుమతి లేకుండానే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హఠాత్‌గా లోపలికి ప్రవేశించడం అక్కడ ఉన్న అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఈ సమావేశంలో అమెరికా మిలిటరీకి చెందిన అత్యంత ఆధునిక యుద్ధ విమానాలైన ఎఫ్-47 స్టెల్త్ ఫైటర్ జెట్‌లపై ట్రంప్‌కు సమాచారం అందిస్తున్నారు. ఈ గోప్యమైన భేటీ జరుగుతున్న సమయంలోనే జుకర్‌బర్గ్ అనుకోకుండా సమావేశ మందిరంలోకి అడుగుపెట్టారు. భద్రతా అనుమతి లేకుండానే ఓవల్ ఆఫీస్‌లోకి వచ్చిన జుకర్‌బర్గ్‌ను సిబ్బంది మర్యాదపూర్వకంగా బయటకు పంపించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
భద్రతా లోపమా..? తప్పనిసరి పరిణామమా..?
సైనికాధికారుల ప్రకారం, ఇది ఒక రకమైన భద్రతా లోపంగానే భావించారు. అత్యంత రహస్య సమావేశంలో అనుమతి లేకుండా ఒక కార్పొరేట్ అధినేత ప్రవేశించడం పట్ల మిలిటరీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు.
వైట్‌హౌస్ వివరణ
అయితే, ఈ వార్తలపై వైట్‌హౌస్ సీనియర్ అధికారి స్పందించారు. “జుకర్‌బర్గ్‌ను బయటకు పంపించారని వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ట్రంప్ ఆహ్వానం మేరకే ఆయన లోపలికి వచ్చారు. అధ్యక్షుడిని పలకరించి తిరిగి బయటకు వెళ్లారు. తర్వాత ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు” అని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ – జుకర్‌బర్గ్ మధ్య మళ్లీ చిగురించిన స్నేహం
2021లో క్యాపిటల్ హిల్స్ ఘటన అనంతరం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ట్రంప్ ఖాతాలను నిషేధించి, అతనిపై మెటా వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల వేళ జుకర్‌బర్గ్ మళ్లీ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి సానుకూలంగా స్పందించిన జుకర్‌బర్గ్, ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఎన్నికల నిధులుగా 1 మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు.
ఈ అనూహ్య సంఘటన ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించినా, అధికారికంగా ఇచ్చిన వివరణతో ఒక స్థాయిలో సందేహాలు తొలగినట్లు కనిపిస్తోంది. అయినా సరే, భద్రతా ప్రమాణాల విషయంలో ఇలా జరగడం అమెరికన్ పాలన వ్యవస్థపై కొన్ని కీలక ప్రశ్నలను మిగిల్చింది.
