తాజా డిమాండ్: మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలి
అమెరికాలోని ప్రముఖ మహానగరాల్లో ఒకటి న్యూయార్క్. ఈ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకుడు జోహ్రాన్ మమ్దానీ గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jun 2025 6:00 PM ISTఅమెరికాలోని ప్రముఖ మహానగరాల్లో ఒకటి న్యూయార్క్. ఈ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకుడు జోహ్రాన్ మమ్దానీ గురించి తెలిసిందే. ముస్లిం అయిన ఆయన ఇప్పటికే హాట్ టాపిక్ గా మారారు. డెమొక్రటీ పార్టీకి చెందిన ఇతను ఇప్పటికే పార్టీ ప్రైమరీలో నెగ్గారు. ఇలాంటివేళ.. అధికార రిపబ్లిక్ పార్టీ ఈయనపై సంచలన ఆరోపణలు చేయటమే కాదు షాకింగ్ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చింది.
ఆయనకు జారీ చేసిన పౌరసత్వం మీద దర్యాప్తు చేయాలని.. ఆయన అక్రమ పద్దతిలో సిటిజన్ షిప్ పొందినట్లుగా ఆరోపిస్తున్నారు. అసలు ఆయన అమెరికా పౌరుడు కాదని..ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి.. దేశం నుంచి గెంటేయాలని కోరుతున్నారు. ఇదేదో మాట వరసకు కాదు. పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆయన పౌరసత్వం రద్దుపై టెన్సీస్సీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ ఓగ్లెస్ యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీకి లేఖ రాశారు.
ఇక.. మమ్దానీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిందే. ప్రముఖ దర్శకురాలు మీనా నాయర్ కొడుకే ఈ మమ్దానీ. ఆయనకు 2018లో అమెరికా పౌరసత్వం లభించగా.. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై రిపబ్లిక్ పార్టీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణల్ని చూస్తే..
- ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చారు
- ఉగ్రవాదులతో తనకున్న సంబంధాల్ని దాచి పెట్టారు
- రాడికల్ వ్యక్తి న్యూయార్క్ సిటీని నాశనం చేస్తాడా?
- వంద శాతం కమ్యూనిస్టు పిచ్చోడు
- పాలస్తీనా అనుకూల.. ఇజ్రాయెల్ వ్యతిరేకి
- తరచూ అబద్దాలు చెబుతాడు. పూర్తి అవకాశ వాది.
- నెరవేర్చలేని, అసాధ్యమైన హామీల్ని వాగ్దానాల్ని ఇస్తాడు
భారత ప్రధాని నరేంద్ర మోడీ మీదా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. 2002లో గుజరాత్ ఘర్షణల వేళ మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. గుజరాత్ లోని ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని.. చాలా మందిని హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మాదిరే మోడీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడటం తెలిసిందే. దీంతో.. పలువురు హిందువులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇస్తున్న హామీల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మమ్దానీని ఓడించేందుకు అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు న్యూయార్క్ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఇంతకూ ఆయన ఇంతటి వ్యాఖ్యలు చేయటానికి కారణం.. మమ్దానీ ఎన్నికల హామీలేనని చెప్పాలి. ఆయన ఇస్తున్న హామీల్లో ప్రధానమైనవి చూస్తే..
- అపార్ట్ మెంట్లలో అద్దెల క్రమబద్ధీకరణ. అవసరమైతే భారీగా తగ్గేలా ఏర్పాట్లు
- ప్రజాధనంతో ప్రజలందరికి ఉచిత బస్సు సౌకర్యం
- శిశు సంరక్షణ కార్యక్రమాలు
- నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లు తెరవటం
- ఎన్నికల హామీల అమలుకు 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయి. వాటిని సమకూర్చుకునేందుకుసంపన్నులపై అధిక పన్నులు.
- ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ యుద్ధ నేరాలకు పాల్పడ్డారు. అతను న్యూయార్క్ కు వస్తే అరెస్టు చేసి జైల్లో పడేస్తా (ఈ వ్యాఖ్యలు గతంలో చేశారు)
