Begin typing your search above and press return to search.

అన్నం చేత్తో తింటే తప్పా.. ఏం అమెరికన్ నేతలు రా బై

అయితే, మమ్దానీ తినే తీరును జాత్యహంకారంగా పేర్కొంటూ పలువురు నెటిజన్లు ఆయనకు బలంగా మద్దతు తెలిపారు. ‘‘తినడం ఒక సంస్కృతి అంశం.

By:  Tupaki Desk   |   1 July 2025 1:04 PM IST
అన్నం చేత్తో తింటే తప్పా.. ఏం అమెరికన్ నేతలు రా బై
X

న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ తరఫున విజయం సాధించిన జోహ్రాన్ ఖ్వామీ మమ్దానీ ఇటీవల ఒక భోజనంతో వార్తల్లో నిలిచారు. ఆయన చేత్తో పప్పన్నం తినడమే ఈ వివాదానికి కేంద్రబిందువైంది. అభ్యర్థిత్వ గెలుపు అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమ్దానీ, ఒక చిన్న ప్లేట్‌లో అన్నం, పప్పు కలుపుకుని హాయిగా చేత్తో తిన్నారు. అయితే ఈ దృశ్యం కొందరికి రుచించలేదు.

ఈ వీడియోను ‘ఎడ్ ఓక్‌నెస్’ అనే ఎక్స్ ఖాతాదారు పోస్టు చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘అన్నం చేత్తో తినడం అనాగరికం. ఆయన తీరులో థర్డ్ వరల్డ్ దేశాల ముద్ర ఉంది. అలాంటిదే ఆయన స్ఫూర్తిగా చెబుతున్నారన్నమాట’’ అని ఎద్దేవా చేశారు. దీనికి అమెరికా రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ మద్దతు పలికి "ఇలాంటి వాళ్లు అమెరికాలో కాదు, తాము పొగడే దేశాల్లోనే ఉండాలి" అంటూ విమర్శించారు.ఈ సందర్భంలో మరికొంతమంది నేతలు కూడా విమర్శలకు పాల్పడ్డారు. మాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ కూడా మమ్దానీని టార్గెట్ చేశారు. ‘‘ఇది రాజకీయ స్టంట్ మాత్రమే. సాధారణంగా ఆయన చెంచాతో తింటారు’’ అని ఆరోపించారు.

-విమర్శలను తిప్పికొట్టిన నెటిజన్లు: సంస్కృతి, జాత్యహంకారంపై చర్చ

అయితే, మమ్దానీ తినే తీరును జాత్యహంకారంగా పేర్కొంటూ పలువురు నెటిజన్లు ఆయనకు బలంగా మద్దతు తెలిపారు. ‘‘తినడం ఒక సంస్కృతి అంశం. చింతకాయ తినాలంటే చేత్తోనే కదా? బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైలు, టాకోస్, లేస్ ప్యాకెట్లు కూడా చేత్తోనే తింటారు కదా! మరి అన్నం చేత్తో తినడమే తప్పా?’’ అని ప్రశ్నించారు. ఈ వాదనను సమర్థిస్తూ పశ్చిమ దేశాల్లో కూడా చేత్తో తినే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయని గుర్తు చేశారు. ‘‘చేత్తో తినడం అనాగరికమైతే, మీ ఆహారపు అభ్యాసాలే ఎంత అనాగరికమో ముందుగా చూసుకోండి. ఇది జాతిపరమైన అహంకారపు ప్రతిబింబం’’ అంటూ మరికొందరు విమర్శలను తీవ్రంగా వ్యతిరేకించారు. వేర్వేరు సంస్కృతులకు సంబంధించిన ఆహారపు అలవాట్లను తక్కువ చేసి చూడటం కేవలం వివక్షేనని స్పష్టం చేశారు.

- వ్యక్తిగత ఆచారంపై రాజకీయ చతురత

జోహ్రాన్ మమ్దానీ తిన్న తీరు నెగెటివ్ ప్రచారానికి గురయ్యింది గానీ ఇది ఒక వ్యక్తిగత, సాంస్కృతిక ఆచారమేనన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తినే పద్ధతులు ప్రాంతాన్నిబట్టి, పూర్వీకులపై ఆధారపడి ఉంటాయి. చేత్తో తినడమే తప్పు అని గట్టి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ చతురతే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఎంపికను రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించే ప్రయత్నమని నెటిజన్లు కూడా స్పష్టం చేస్తున్నారు.