ట్రంప్, పుతిన్ రండి.. చర్చలకు సిద్ధం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన
ఈ 'ట్రిపుల్ మీటింగ్'లో తనతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనేది ఆయన ఆకాంక్ష.
By: Tupaki Desk | 29 May 2025 3:00 AM ISTరష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా, పుతిన్ సేనలు మాత్రం ఉక్రెయిన్‌పై నిత్యం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రష్యా దండయాత్రను ఎలాగైనా ఆపాలని తపిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ఆయన చేసిన ఈ పిలుపు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
జెలెన్‌స్కీ ప్రతిపాదన
జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. "పుతిన్ రెండు దేశాల మధ్య చర్చలకు ఇష్టపడకపోతే, మూడు దేశాల మధ్య చర్చలైనా పర్వాలేదు. ఏ తరహా సమావేశానికైనా నేను సిద్ధమే" అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ 'ట్రిపుల్ మీటింగ్'లో తనతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనేది ఆయన ఆకాంక్ష. అంతేకాదు, శాంతి ఒప్పందానికి ముందుకు రాకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని కూడా జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఇది రష్యాపై ఒత్తిడి పెంచి, చర్చలకు దారితీయాలనే జెలెన్‌స్కీ వ్యూహంగా కనిపిస్తోంది.
పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నాడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుపై డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ "నిప్పుతో ఆడుకుంటున్నాడని" ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. "నేను ఇక్కడ లేకపోతే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది. చాలా చాలా నష్టం వాటిల్లి ఉండేది. ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద వైమానిక దాడిపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
"పుతిన్‌తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఆయనకు ఏమవుతుంతో అర్థం కావట్లేదు. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా చాలా మందిని చంపుతున్నారు. ఇక్కడ నేను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదు. కారణం లేకుండానే ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన ఉక్రెయిన్‌లో కొంత భూభాగాన్ని కాదు.. ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. తన దృష్టిలో అది సరైనదే కావొచ్చు.. కానీ, అది రష్యా పతనానికే దారితీస్తుంది" అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం, రష్యా, ఉక్రెయిన్‌లు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఆయన ప్రకటనకు తగ్గట్టుగా అడుగులు పడలేదు. దీంతో ట్రంప్ మాటల్లో ఆ అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు జెలెన్‌స్కీ ఇచ్చిన ఈ ట్రిపుల్ మీటింగ్ ప్రతిపాదనకు పుతిన్, ట్రంప్ ఎలా స్పందిస్తారో, ఇది శాంతి చర్చలకు దారితీస్తుందో లేదో చూడాలి.
