వారాలుగా నిలిచిన ఆ దేశ మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు.. కారణం తెలిస్తే షాకే!
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన జాంబియా మాజీ అధ్యక్షుడు (68) మరణించి ఇరవై రోజులైనా అంత్యక్రియలు జరగలేదు.
By: Tupaki Desk | 26 Jun 2025 4:00 PM ISTరాజకీయం అన్న తర్వాత వైరం మామూలే. ఒకరిని ఒకరు రాజకీయంగా దెబ్బ తీసుకోవటానికి వేసే ఎత్తులు.. పైఎత్తులు ఎలా ఉంటాయో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు చెప్పే ఉదంతం చూస్తే.. మరీ ఇంత దరిద్రపుగొట్టు రాజకీయ వైరం ఏంది సామి అని మాత్రం అనుకోకుండా ఉండలేరు. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన జాంబియా మాజీ అధ్యక్షుడు (68) మరణించి ఇరవై రోజులైనా అంత్యక్రియలు జరగలేదు. దీనికి కారణం రాజకీయ వైరమే. విన్నంతనే ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతంలోకి వెళితే..
జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగూ. ఆయన ఇటీవల మరణించారు. ఆయన అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయనకు రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన జాంబియా ప్రభుత్వం ఒక వైపు చెబుతుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికాలో ప్రైవేటుగా నిర్వహించుకుంటామని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లెక్కలు తేలక.. కోర్టును ఆశ్రయించటంతో రెండుసార్లు అంత్యక్రియల్ని ప్రకటించి ఆపేశారు. న్యాయస్థానం నుంచి తుది తీర్పు వచ్చే వరకు అంత్యక్రియల్ని జరపొద్దంటూ తాత్కాలిక ఆదేశాలు ఇవ్వటంతో మరోసారి అంత్యక్రియలపై ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ఎడ్గర్ లుంగూ జాంబియాలోని పేట్రియాటిక్ ఫ్రంట్ నేత. ఆయన జాంబియా అధ్యక్షుడిగా 2015-21 మధ్య కాలంలో పని చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన జూన్ ఐదున దక్షిణాఫ్రికాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై వివాదం నెలకొంది. తాను మరణించిన తర్వాత ప్రస్తుత జాంబియా అధ్యక్షుడు హిచిలేమా హాజరు కాకూడదని లుంగూ గతంలో తమకు స్పష్టంగా చెప్పాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. లుంగూకు.. హిచిలేమాకు మధ్యనున్న రాజకీయ వైరం గురించి ప్రస్తావించాలి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిచిలేమాను ఓడించి లుంగూ పాలన చేపట్టారు. ఆ తర్వాత అధ్యక్షుడి కాన్వాయ్ కు దారి ఇవ్వలేదన్న అభియోగంపై కేసు నమోదు కావటం.. హిచిలేమా నాలుగు నెలలు జైల్లో ఉన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో లుంగూ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం హిచిలేమా జైలు నుంచి విడుదలయ్యారు. 2021లో జరిగిన ఎన్నికల్లో లుంగూ ఓడిపోగా.. హిచిలేమా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది.
ఇంతటి రాజకీయ వైరం ఈ ఇద్దరి మధ్య ఉంది. దీంతో.. లుంగూ కోరుకున్నట్లుగా ఆయన అంత్యక్రియల్ని దక్షిణాఫ్రికాలోనే చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్లే జోహన్నెస్ బర్గ్ లోని ఒక ప్రైవేటు శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు. మాజీ దేశాధ్యక్షుడి పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం సౌతాఫ్రికాకు చేరుకున్నారు. అయితే.. లుంగూ అంత్యక్రియల్ని తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా సారథ్యంలో జరుగుతాయని జాంబియా ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాదు.. లుంగూ కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా సౌతాఫ్రికాలో జరుగుతున్న అంత్యక్రియల్ని ఆపేసేందుకు వీలుగా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. జాంబియా చట్టాల ప్రకారం మాజీ దేశాధ్యక్షుడి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల్సి ఉంటుందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో మరణించిన దేశాధ్యక్షులను ఖననం చేసిన శ్మశాన వాటికలోనే లుంగూ కోసం సమాధిని ఏర్పాటు చేశామని.. దేశ ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోర్టును కోరింది.
దీంతో.. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు వరకు వాయిదా వేసింది. ఈ లోపు ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినా.. ఎంత రాజకీయ వైరం ఉంటే మాత్రం.. మరణించిన మాజీ దేశాధ్యక్షుడి విషయంలో ప్రస్తుత దేశాధ్యక్షుడు ఇంత ముకుం పట్టు పట్టటమా? అన్నది ప్రశ్నగా మారింది.
