Begin typing your search above and press return to search.

జహీరాబాద్ అమ్మాయి.. హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్య మరణం!

అయ్యో అనిపించే విషాద ఉదంతం కులూలో చోటు చేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగి నిర్లక్ష్యం జహీరాబాద్ అమ్మాయి ప్రాణాల్ని బలి తీసుకుంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:30 AM GMT
జహీరాబాద్ అమ్మాయి.. హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్య మరణం!
X

అయ్యో అనిపించే విషాద ఉదంతం కులూలో చోటు చేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగి నిర్లక్ష్యం జహీరాబాద్ అమ్మాయి ప్రాణాల్ని బలి తీసుకుంది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ఐటీ దంపతుల్లో.. భర్త కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఆదివారం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ఘటన వివరాలు బయటకు వచ్చినా.. ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు మాత్రం కాస్తంత ఆలస్యంగా వెలుగు చూశాయి.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సాయి మోహన్.. నవ్యలకు ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. కొంతకాలం హైదరాబాద్ లో ఉన్న వారు ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా చండీగఢ్ లో ఐటీ ఉద్యోగులుగా ఉంటున్నారు.

విహారయాత్ర కోసం వారు హిమాచల్ ప్రదేశ్ లోని కులూకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్ చేసేందుకు ఉత్సాహం చూపింది. ఇందులో భాగంగా ఆమె పారా గ్లైడింగ్ చేయగా.. ఆమెకు పెట్టిన బటన్ సరిగా పెట్టకపోవటం కారణంగా.. గాలిలో ఉన్న కొద్దిసేపటికే ఆమె పెట్టుకున్న బెల్టు హుక్ ఊడిపోయి.. పైనుంచి కిందకు పడి దుర్మరణం పాలైంది.

ఒక ఇంటి కప్పు మీద పడిన ఆమె.. అక్కడికక్కడే మరణించింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లుగా హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అధికారులు పేర్కొన్నారు. పారా గ్లైడింగ్ పైలెట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజా ఉదంతంపై అధికారులు సీరియస్ అయ్యారు. పారా గ్లైడింగ్ పైలెట్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి.. అతడిపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తమ కుమార్తె పారా గ్లైడింగ్ చేస్తున్నట్లుగా వీడియోకాల్ మాట్లాడిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లుగా నవ్య తల్లిదండ్రులు వాపోతున్నారు. కళ్ల ముందే భార్య ప్రాణాలు విడవటాన్ని నవ్య భర్త జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు తీవ్రమైన షాక్ లో ఉన్నారు. పోస్టు మార్టం అనంతరం అధికారులు సోమవారం రాత్రి నవ్య డెడ్ బాడీని విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జహీరాబాద్ కు తీసుకెళుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతో అయ్యో అనుకుంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు