Begin typing your search above and press return to search.

యువగళంకు మళ్ళీ బ్రేక్...

లోకేష్ యువగళం పాదయాత్రకు మళ్ళీ బ్రేకులు పడింది. ఈసారి ప్రకృతి అడ్డుపడింది. మిచౌంగ్ తుపాను నేపధ్యంలో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Dec 2023 11:42 AM IST
యువగళంకు మళ్ళీ బ్రేక్...
X

లోకేష్ యువగళం పాదయాత్రకు మళ్ళీ బ్రేకులు పడింది. ఈసారి ప్రకృతి అడ్డుపడింది. మిచౌంగ్ తుపాను నేపధ్యంలో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరుగుతోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర సాగుతున్న రూటులోని నియోజకవర్గాలు తుపాను టార్గెట్ అయ్యాయి. అందుకని సోమవారమే యువగళాన్ని నిలిపేస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. పరిస్ధితులను బట్టి మళ్ళీ 7వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

తుపాను ప్రభావంతో అవస్తలు పడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు సహాయ కార్యక్రమాలను అందించాలని లోకేష్ పిలుపిచ్చారు. పార్టీలోని నేతలు, క్యాడర్ మొత్తం సహాయపనుల్లో ఉండాలని ఆదేశించారు. ఒకవైపు సహాయపనుల్లో పాల్గొంటు మరోవైపు యువగళంలో పాల్గొనాలంటే నేతలు, క్యాడర్ కు ఇబ్బందులు తప్పవు. అందుకనే పాదయాత్రకన్నా ముందు సహాయ కార్యక్రమాలే అవసరమని లోకోష్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే తనతో పాటు నడుస్తున్న నేతలు, క్యాడర్ ను సహాయపనులకు మళ్ళించారు.

మామలూగా అయితే పాదయాత్రలో తనతో పాటు నడిచేందుకు నేతలు, క్యాడర్ ప్రయారిటి ఇస్తారని లోకేష్ కు తెలుసు. అందుకనే పాదయాత్రను తాత్కాలికంగా రద్దుచేసుకున్నారు. తొందరలోనే తుపాను తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞనులు అంచనా వేస్తున్నారు. అందుకనే మూడురోజులు యువగళానికి లోకేష్ బ్రేక్ ఇచ్చింది. 7వ తేదీన పరిస్ధితిని అంచనా వేసుకోవాలని లోకేష్ అనుకున్నారు. మామూలుగా తుపాను పరిస్ధితులు ఎలాగుంటాయంటే భారీవర్షాలున్నపుడు సహాయ చర్యలు చేయటం కూడా కష్టమవుతుంది. తుపాను వెళ్ళిపోయి, వర్షాలు తగ్గిపోయిన తర్వాతకానీ సహాయచర్యలు చేపట్టేందుకు వీలుండదు.

భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి శిబిరాలు ఏర్పాటుచేసి కనీస వసతులు ఏర్పాటుచేయటంపైనే ప్రభుత్వాలు దృష్టిపెడతాయి. ఈ సమయంలో పార్టీలు, స్వచ్చంద సంస్ధల అవసరం ప్రభుత్వానికి ఎక్కువగా అవసరం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే లోకేష్ తన యువగళానికి బ్రేక్ ఇచ్చి పార్టీ యంత్రాంగం మొత్తాన్ని సహాయచర్యల్లో పాల్గొనమని చెప్పింది. ఇంతకుముందు చంద్రబాబునాయుడు అరెస్టు సందర్భంగా కూడా లోకేష్ రెండునెలలు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.