Begin typing your search above and press return to search.

క్యాన్సర్‌ చికిత్సపై తప్పుడు వీడియోలు...యూట్యూబ్ కీలక నిర్ణయం!

అవును... యూట్యూబ్ లో తప్పుడు సమాచరంలో ఎన్నో వీడియోలు ఉన్నాయని అంటుంటారు

By:  Tupaki Desk   |   17 Aug 2023 11:22 AM GMT
క్యాన్సర్‌ చికిత్సపై తప్పుడు వీడియోలు...యూట్యూబ్ కీలక నిర్ణయం!
X

యూట్యూబ్ లో ఉండే వీడియోల సంగతి తెలిసిందే. అందులో ఎంతో ఉపయుక్తమైన వీడియోలు ఎన్ని ఉంటాయో.. పనికిరాని వీడియోలు.. తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు కూడా అన్నే ఉంటాయని అంటుటారు! ఈ సమయంలో యూట్యూబ్ ఒక కీలక నిర్ణయం తీసుకొంది.

అవును... యూట్యూబ్ లో తప్పుడు సమాచరంలో ఎన్నో వీడియోలు ఉన్నాయని అంటుంటారు. ఆఖరికి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతమంది తప్పుడు కథనాలతో వీడియోలు రూపొందిస్తుంటారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అటువంటి వీడియోలను తొలగించాలని యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకొంది.

ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.వో) లేదా వైద్య ఆరోగ్య శాఖ చెప్పే సమాచారానికి విరుద్ధంగా.. వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉన్న వీడియోలను తొలగించనున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. ముఖ్యంగా "వెల్లుల్లితో క్యాన్సర్‌ నయం" వంటి సూచనలు చేసే వీడియోలను తొలగిస్తామని వెల్లడించింది.

ఈ సందర్భంగా... ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, ఔషధాలకు సంబంధించి అసత్య సమాచారంపై తమ విధానాలను క్రమబద్ధీకరిస్తామని యూట్యూబ్ తెలిపింది. తప్పుదోవ పట్టించే విషయాల్లో దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయడంమీద దృష్టి సారించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఇందులో ముఖ్యంగా కచ్చితమైన చికిత్స ఉన్నప్పటికీ.. దానికి బదులుగా నిరాధారమైన చికిత్సను ప్రోత్సహించే వీడియోలు, హాని కలిగించే వీడియోలు ఇక ఉండవని తెలిపింది. ఈ పనిని వెంటనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈ కీలక విషయాలను తన బ్లాగ్‌ లో పేర్కొంది.

ఈ సమయంలో క్యాన్సర్‌ బారినపడిన వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యులు సైతం... వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన చికిత్స వంటి అత్యంత విలువైన అంశాలను తెలుసుకునేందుకు ఆన్‌ లైన్‌ లో పరిశోధిస్తున్నారని.. అలాంటప్పుడు వారికి అత్యంత నాణ్యమైన కంటెంటును అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని యూట్యూబ్ తెలిపింది.