Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా కేసులో కీలక అప్ డేట్... తెరపైకి కృష్ణారెడ్డి పిటిషన్!

2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Dec 2023 8:22 AM GMT
వైఎస్ వివేకా కేసులో కీలక అప్ డేట్... తెరపైకి కృష్ణారెడ్డి పిటిషన్!
X

2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ నడుస్తూ ఉంది! ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి వివేకా కుమార్తె, అల్లుడు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు.

అవును... వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ఫలితంగా... పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు! ఇందులో భాగంగా... ఈ కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందులో వివేకా పీఏ కృష్ణారెడ్డి, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

వాస్తవానికి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారు. ఇందులో భాగంగా... వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో... పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని ఒకవైపు సీబీఐ ఎస్పీ రాంసింగ్‌.. మరోవైపు సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు.

దీంతో ఈ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ 8న పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు అదేశాలతో రంగంలోకి దిగిన పులివెందుల పోలీసులు... వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ లపై కేసు నమోదు చేశారు.

దీంతో తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. వేధించడానికే తప్పుడు కేసు నమోదు చేశారని.. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు ఫిర్యాదును పోలీసులకు పంపిందని ఆరోపిస్తూ... ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ వివేకా కుమార్తె, ఆమె భార్త తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

ఇందులో భాగంగా... వివేకా హత్యకు గురైనప్పుడు ఫిర్యాదుదారు అక్కడ ఉన్నారన్నారు. 2023 జూన్‌ 30న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో ఫిర్యాదుదారుడు వివేకా పీఏ కృష్ణారెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ కారణాలను వెల్లడించిందని తెలిపారు. హత్య విషయంలో కృష్ణారెడ్డి జోక్యం ఉన్నట్లు సీబీఐ స్పష్టంగా అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. కేవలం తమ మీద పగతో స్థానికుల ప్రమేయంతో తప్పుడు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని పేర్కొన్నారు.