Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక అప్‌ డేట్‌!

ఇందుకు సంబంధించి ఆగస్టు 24నే తెలంగాణ హైకోర్టు తమ తీర్పును రిజర్వులో ఉంచగా.. తాజాగా ఉత్తర్వులను వెలువరించిం

By:  Tupaki Desk   |   4 Sep 2023 11:04 AM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక అప్‌ డేట్‌!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వారి సహచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలు తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరగా తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వారిద్దరి బెయిల్‌ పిటిషన్లను సింగిల్‌ జడ్జి ధర్మాసనం కొట్టేసింది.

ఇందుకు సంబంధించి ఆగస్టు 24నే తెలంగాణ హైకోర్టు తమ తీర్పును రిజర్వులో ఉంచగా.. తాజాగా ఉత్తర్వులను వెలువరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది తన కక్షిదారులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. పిటిషనర్లపై సీబీఐ ఆరోపణలకు సాక్షులు లేదా సాక్ష్యాలు రెండూ లేవని నొక్కి చెప్పారు.

కాగా ఈ కేసులో పిటిషనర్లు ఇప్పటికే ఐదు నెలలకు పైగా జైలులో ఉన్నారని భాస్కరరెడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం 72 ఏళ్ల భాస్కర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగో లేదని.. జైలులో ఉన్నప్పుడే అనేక వైద్య పరీక్షలు చేయించుకున్నారని సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌ రెడ్డి కోర్టుకు వివరించారు. వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను సమర్పించారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి జూన్‌ లోనే సీబీఐ విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున పిటిషనర్లకు బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని కూడా నిరంజన్‌ రెడ్డి వాదించారు.

మరోవైపు నిందితులకు ఈ దశలో బెయిల్‌ మంజూరు చేస్తే వారు దర్యాప్తును నిర్వీర్యం చేస్తారని సీబీఐ వాదించింది. వారికి బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది. విచారణ ప్రస్తుతం చివరి దశలో ఉందని కోర్టుకు తెలిపింది.

ఈ కేసులో భాస్కర్‌ రెడ్డి నేర చరిత్రతో పాటు సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారని సీబీఐ వెల్లడించింది. గతంలో ఈ కేసులో పలువురు సాక్షులను ప్రభావితం చేయడంలో వైఎస్‌ భాస్కరరెడ్డి కీలక పాత్ర పోషించారని కూడా ఆరోపించింది.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఏప్రిల్‌ లో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను జూన్‌ లో సీబీఐ కోర్టు కొట్టివేసింది.

వివేకా కేసులో జూన్‌ 30న సీబీఐ మూడో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. భాస్కర్‌ రెడ్డి, వారి సహచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను వరుసగా ఆరు, ఏడో నిందితులుగా పేర్కొంది.

కడప ఎంపీ స్థానానికి విజయమ్మను కానీ, షర్మిలను కానీ పోటీ చేయించాలని వివేకానందరెడ్డి గట్టిగా జగన్‌ పై ఒత్తిడి తెచ్చారని.. ఇది నచ్చని వైఎస్‌ భాస్కరరెడ్డి.. వివేకాను హత్య చేయించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకు అవినాశ్‌ రెడ్డి కూడా కుట్ర పన్నారని సీబీఐ అభియోగాలు మోపింది.

కాగా ఈ కేసులో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన రెండు రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 16న భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. మరోవైపు అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.