Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!

ఎన్నికల వేళ ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారం కీలకంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 April 2024 10:47 AM GMT
ఎన్నికల వేళ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!
X

ఎన్నికల వేళ ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ కేసులో నిందితుడు అయిన అవినాష్ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఎలా ఇస్తారంటూ జగన్ పై షర్మిళ, సునీత నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వడంవల్లే తాను అక్కడ పోటీ చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించగా... రానున్న ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని సునీత కోరుతున్నారు.

ఇలా రానున్న ఎన్నికల్లో వైఎస్ వివేకా మర్డర్ కేసు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్న సమయంలో... ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడంపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో... సుప్రీంకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. దీంతో... ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

అవును... మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే! దీంతో... తన తండ్రిని హతమార్చిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెబుతున్న సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు! ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో... ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది.

ఈ సమయంలో శివశంకర్ రెడ్డితో పాటుగా ప్రతివాదులుగా ఉన్నవారందరికీ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించిన తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.

కాగా... వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇదే సమయంలో... ప్రతి సోమవారం సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) ముందు హాజరుకావాలని పేర్కొంది. అదేవిధంగా... ఏపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించ కూడదని కూడా హైకోర్టు షరతు విధించింది.