Begin typing your search above and press return to search.

నన్ను చంపేస్తామంటున్నారు.. సునీత ఫిర్యాదు!

తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు

By:  Tupaki Desk   |   2 Feb 2024 10:20 AM GMT
నన్ను చంపేస్తామంటున్నారు.. సునీత ఫిర్యాదు!
X

2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. సీబీఐ విచారణ కావాలని.. ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని కూడా అరెస్టు చేసి విడుదల చేశామని సీబీఐ తెలిపింది. ప్రస్తుతం అవినాష్‌ బెయిల్‌ పై ఉన్నారు.

ఇటీవల తన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఇడుపులపాయలో సునీత కలవడం, ఆమెతో పాటు ఇడుపులపాయకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత తాజాగా ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫేస్‌ బుక్‌ లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సైబర్‌ క్రై మ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

ఫేస్‌ బుక్‌ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన సోదరి వైఎస్‌ షర్మిలను ''లేపేస్తాం'' అనే విధంగా బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది.. '' నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో నా పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌ బుక్‌ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. వర్రా రవీంద్ర రెడ్డి పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడు. అతడు పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి' అని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

''జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీంద్రా రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్‌ పెట్టాడు. ''అందుకే పెద్దలు అన్నారు.. శత్రు శేషం ఉండకూడదు లేపేయ్‌ అన్నాయ్‌.. ఇద్దరినీ ఈ ఎన్నికలకు పనికి వస్తారు'' అని ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెట్టాడని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన స్నేహితులు వర్రా రవీంద్రరెడ్డికి చెందిన ఫేస్‌ బుక్‌ లింక్‌ పంపారని తెలిపారు. అతడి ఫేస్‌బుక్‌ పోస్టులు తనను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నానన్నారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐకి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశానని సునీత గుర్తు చేశారు.

''రవీంద్రారెడ్డి ఫేస్‌ బుక్‌ పేజీలో మొత్తం నన్ను, షర్మిలను, వైఎస్‌ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయి'' చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్న రవీంద్రారెడ్డితోపాటు తదితరులపైన తగిన చర్యలు తీసుకోవాలని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా డాక్టర్‌ వైఎస్‌ సునీత సైబర్‌ క్రై మ్‌లో ఫిర్యాదు చేశారని సైబర్‌ క్రై మ్‌ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు ఫేస్‌ బుక్‌ లో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారని తెలిపారు.