Begin typing your search above and press return to search.

అన్న బంధాలు లేవా.. చెల్లెమ్మ చెల్లు చీటీ రాసిందా...?

అనుబంధాలు ఆత్మీయత అంతా ఒక బూటకం అని ఒక సినిమా పాట ఉంది. ఇక దైనందిన జీవితంలో కూడా అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:44 PM GMT
అన్న బంధాలు లేవా.. చెల్లెమ్మ చెల్లు చీటీ రాసిందా...?
X

అనుబంధాలు ఆత్మీయత అంతా ఒక బూటకం అని ఒక సినిమా పాట ఉంది. ఇక దైనందిన జీవితంలో కూడా అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎవరికి బంధం అవుతారో విడిపోతారో చెప్పలేరు. రాజకీయాల్లో చూసుకుంటే చాలా సన్నని ధారపు పొరలా బంధాలు ఉంటాయి.

అందులో అన్నదమ్ములు అయినా అన్నా చెల్లెళ్ళు అయినా ఆఖరుకు భార్యాభర్తలు అయినా కూడా రాజకీయమే మధ్యలో నిలిచి గెలుస్తుంది. వైఎస్సార్ ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు. వైఎస్ జగనన్న బాణం అని చెప్పిన చెల్లెమ్మ ఇపుడు బంధాలు ఏమీ లేవు అని తెగేసి చెబుతున్నారు.

నా వైపు నుంచి చూస్తే ఏ సంబంధం లేదని అనుకుంటున్నాను అని ఏకంగా లోటస్ పాండ్ ప్రాంగణమే ఆశ్చర్యపోయేలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎందుకంటే అదే లోటస్ పాండ్ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రధాన సాక్షిగా ఉంది. ఇపుడు అక్కడ నుంచే చెల్లెమ్మ నా గురించి ఎందుకు మీకు అని సజ్జల రామక్రిష్ణారెడ్డిని ప్రశ్నిస్తూనే జగన్ని కూడా అడిగినట్లుగానే మాట్లాడారు.

నేను అయితే ఏ సంబంధం లేదు అని అనుకుంటున్నా అని క్లారిటీగా చెప్పేసారు. నా గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే ఇపుడు మళ్ళీ సంబంధాలు కలుపుకుందామనుకుంటున్నారా అని లాజిక్ పాయింట్ ఒకటి తీశారు. నాతో సంబంధం ఉందా లేదా అన్నది మీరే సమాధానం చెప్పాలని కూడా ఆమె కోరుతున్నారు.

సజ్జల మాట అంటే జగన్ మాట అని అంతా అంటూంటారు అని మీడియా ప్రతినిధులు షర్మిలను ప్రశ్నించినపుడు ఆమె ఎవరికైనా ఒక్కటే సమాధానం అని చెప్పడమే అసలైన విషయం. అంటే తన జవాబు సజ్జలకే కాదు జగన్ కి కూడా అని ఆమె చెప్పేశారు అన్న మాట.

అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటిది ఇపుడు ఈ విధంగా షర్మిల మాట్లాడడం అంటే ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు. ఆమె ఈ రోజుకు కాంగ్రెస్ మద్దతుదారు. రేపటి రోజున ఆమె పార్టీని విలీనం చేసి పూర్తి స్థాయి కాంగ్రెస్ నాయ్కులురాలు అయితే ఇక వైసీపీ మీద తన సొంత అన్న మీద విమర్శలకు వెనకాడబోరు అనడానికి ఈ వ్యాఖ్యలు ఒక ఉదాహరణ అని అంటున్నారు.

అంతే కాదు రేపటి రోజున కాంగ్రెస్ లో చేరాక ఏపీ రాజకీయాలను చూడమన్నా ఆమె చూడడానికి రెడీ అన్నట్లుగానే ఆమె మాటలు ఒక సంకేతంగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం కూడా ఆగింది ఆ ఒక్క కండిషన్ మీదనే. ఆమెను ఏపీ రాజకీయాలను చూసుకోమని ఢిల్లీ పెద్దలు కోరారు.

ఇపుడు ఆమె పోటీ నుంచి తన పార్టీని విరముంచుకున్నారు అంటే తెలంగాణా రాజకీయాలకు ఆమె స్వస్తి అనేశారు అనే అంటున్నారు. ఇక ఆమె సేవలను ఏపీలో వాడుకోవడానికి హై కమాండ్ కి కూడా అవకాశం ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు. రేపటి రోజున కాంగ్రెస్ తెలంగాణాలో గెలిస్తే ఏపీలో కూడా మంచి స్కోప్ ఉంటుంది.

ఇక ఇదే షర్మిల తన పట్టుదలను తన పాదయాత్రను తన దూకుడు రాజకీయాన్ని ఏపీలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్న వారూ ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే షర్మిల మనసు మార్చుకున్నారా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణాలో ఏ అవకాశం లేకుండా పోయిందని అర్ధం అయిన నేపధ్యంలో ఆమె ఏపీ మీదనే ఫోకస్ పెట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దానికి నాందిగా ఆమె ఇండైరెక్ట్ గా జగన్ మీదనే కామెంట్స్ చేశారని అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమి జరగనుందో.