Begin typing your search above and press return to search.

సడెన్ గా డీకే తో షర్మిల భేటీ...బిగ్ క్వశ్చన్స్ ఎన్నో...!?

కడపలో బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సడెన్ గా బెంగళూరు వెళ్ళినట్లుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 April 2024 3:47 AM GMT
సడెన్ గా డీకే తో షర్మిల భేటీ...బిగ్ క్వశ్చన్స్ ఎన్నో...!?
X

కడపలో బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సడెన్ గా బెంగళూరు వెళ్ళినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆమె గత రెండు రోజులుగా జగన్ ప్రభుత్వం మీద ట్విట్టర్ వేదికగానే విమర్శలు చేస్తున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరేందుకు షర్మిలను బెంగళూరులోనే కలసి వచ్చారు.

షర్మిల కొద్ది రోజులుగా బెంగళూరులోనే ఉంటున్నారు అని అంటున్నారు. సీన్ కట్ చేస్తే ఆమె కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎందుకు ఆయనతో భేటీ అయ్యారు అన్నది రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి డీకే ప్రధాన సూత్రధారి అని అంతా అంటారు. ఆయన తెలంగాణాలో కాంగ్రెస్ రావడానికి తన వంతుగా కృషి చేశారు. దాంతో ఏపీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను కూడా హై కమాండ్ ఆయనకే అప్పగించింది. దాంతో డీకే ఏపీలో చూసి చూసి వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ వైపు లాగారు.

ఆమె తన బాధలేవో తాను తెలంగాణాలో పార్టీ పెట్టి పడుతున్నారు. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించి ఆమెను ఏపీకి రప్పించి పీసీసీ ప్రెసిడెంట్ చేయించారు. ఇక చూస్కో ఏపీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు ఆడడం తధ్యమని ఆయన కేంద్ర పెద్దలకు చెప్పారు. అలాగే షర్మిలకూ చెప్పారని అంటున్నారు.

ఇక షర్మిలకు కాంగ్రెస్ లో పార్టీ విలీనం సందర్భంగా చెప్పిన మాటలు ఏంటి అంటే ప్రచారంలో ఉన్నవే తీసుకుంటే మార్చిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒక దానిని ఆమెకు ఇవ్వాలన్నది ఒక కండిషన్ అని అంటారు. కర్నాటకలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి మూడు రాజ్యసభ ఎంపీలు ఖాతాలోకి వచ్చాయి. అందులో ఒకటి షర్మిలకు ఇస్తారని అనుకున్నారు.

కానీ అదేమీ జరగలేదు. ఇక షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలనుకుంటే కాదు పోటీ చేయాల్సిందే అని ఆమెను ఏకంగా కడప గడ్డ నుంచి ఎంపీగా ప్రతిపాదించారు. ఆమె అభ్యర్ధిత్వం ప్రకటించేశారు. షర్మిల బస్సు యాత్రనే తీసుకుంటే స్పందన పెద్దగా కనిపించడం లేదు.

పైగా జగన్ వేవ్ బాగానే అక్కడ ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. కడప నుంచి జగన్ ని ఎదిరించి ఎంపీగా పోటీ చేసి గెలవడం అన్నది ఆషామాషీ కాదు, ఆమె రాజకీయంగా దుస్సాహసమే చేశారు అని అంటున్నారు. ఆమె బస్సు యాత్ర ఫలితంగా ఈ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది అని అంటున్నారు. ఆమె బస్సు యాత్రకు వచ్చిన వారు జై జగన్ అంటూ నినాదాలు చేయడం కొందరు యువకులు అయితే మైకు అందుకుని ఆమె ముందే కాంగ్రెస్ ని విమర్శించడం ఆమెను కూడా జగన్ ని ఏమీ అనవద్దు అని కోరడం వంటివి జరిగాయి.

ఇవే కాదు కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా తాము ఓటు ఎలా వేస్తామని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పట్ల జనంలో వ్యతిరేకత చాలా ఉందని కూడా ఆమెకు తెలియవస్తోంది. వైఎస్సార్ పేరుని చార్జిషీటు లో పెట్టిన కాంగ్రెస్ తరఫున షర్మిల ప్రచారం చేయడమేంటి అని కూడా అడుగుతున్న వారు ఉన్నారు.

మొత్తంగా బస్సు యాత్ర తరువాత కడపలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో ఆమెకు పూర్తిగా అర్ధం అయింది అంటున్నారు. అంతే కాదు దేశంలో చూస్తే మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రానునిద్. ఏపీలో చూస్తే కాంగ్రెస్ సీట్లు గెలిచే అవకాశాలు అయితే ఏమీ లేవు. దీంతో ఎక్కడా అధికారంలోకి రాని కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ జీవితం తన భవిష్యత్తు ఏమిటి అన్నది ఆమెకు ఆలోచనగా మారింది అని అంటున్నారు.

అందుకే ఆమె డీకేని కలిశారు అని అంటున్నారు. కడపలోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ఇక కాంగ్రెస్ గెలుస్తుందని ఎలా అనుకుంటామని ఆమె మధనపడుతున్నారని అంటున్నారు. డీకేతో జరిపిన చర్చలలో ఆమె తన రాజకీయ భవితవ్యం కాంగ్రెస్ ఇచ్చే హామీల మీదనే ఉండొచ్చు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో ఇపుడు హామీలు ఇచ్చినా అక్కడ పదవులు ఏమీ లేవు. రాజ్యసభ సీట్లకు రెండేళ్ళు వేచి ఉండాలి. అపుడే ఖాళీ అవుతుంది. షర్మిలకు చాన్స్ ఇవ్వాలనుకుంటే ఇపుడే ఇచ్చేవారు అని అంటున్నారు.

కాంగ్రెస్ పెద్దలు ఆమె చేత ఏపీ కాంగ్రెస్ ని లేపే ప్రయత్నం చేస్తున్నారని వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నం అని అంటున్నారు. పోతే వెంట్రుక పోతుంది. వస్తే కొండ వస్తుంది. కాంగ్రెస్ కి ఏపీలో చూస్తే నోటా కంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉంది. ఇపుడు అది ఏ మాత్రం పెరిగినా లాభమే. లేకపోతే లేదు ఇదీ కాంగ్రెస్ ఆలోచన. మరి షర్మిలకు రాజకీయ లాభం ఏంటి అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి ఏమీ లేనట్లే అంటున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అందులో రాజకీయాల్లో భవిష్యత్తు హామీలను నమ్మడం అంటే నీటిలో మునక వేసినట్లే అంటునారు. మొత్తానికి చెల్లెమ్మకు తత్వం అర్ధం అయ్యేసరికి పుణ్య కాలం పూర్తి అయిందని అంటున్నారు.