Begin typing your search above and press return to search.

షర్మిల.. రాజీవ్‌ గాంధీని కలిసిందట!

రాజకీయ పార్టీల నేతలు మీడియా ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని.. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 2:30 PM IST
షర్మిల.. రాజీవ్‌ గాంధీని కలిసిందట!
X

రాజకీయ పార్టీల నేతలు మీడియా ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని.. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందుల్లో పడటం ఖాయం. గతంలో సోషల్‌ మీడియా లేని రోజుల్లో ఎలా మాట్లాడినా నడిచిపోయేదేమో కానీ ఇప్పుడు మాత్రం ఎలా పడితే అలా మాట్లాడటం కుదరదు. ఒకవేళ మాట్లాడితే సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫుట్‌ బాల్‌ ఆడటం ఖాయం. ఇక ట్రోలర్స్‌ అయితే చెప్పక్కర్లేదు. మీమ్స్‌ తో తెగ నవ్వు పుట్టించేలా ట్రోల్‌ చేస్తుంటారు.

ఇటీవల కాలంలో తెలంగాణలో వైఎస్సార్సీటీపీ అధ్యక్షురాలు షర్మిల ట్రోలింగ్‌ గు గురయినట్టు మరెవరూ కాలేదు. ఆ రేంజులో ఆమె ట్రోలింగుకు గురయ్యారు. ఉదాహరణకు తన ఐదు వేళ్లను చూపిస్తూ.. ‘‘ఇవి ఐదేళ్లు.. బిగిస్తే పిడికిలి’’, ‘‘పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర’’, ‘‘వాళ్లను విద్యార్థులని అని ఎందుకంటున్నామంటే వారు యువత కాబట్టి’’... ఇలా మాట్లాడి షర్మిల భారీ ఎత్తున ట్రోలింగ్‌ గు గురయ్యారు. షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అలాగే ఇనస్టాగ్రామ్‌ లో అయితే భారీగా రీల్స్‌ కూడా వచ్చాయి.

ఇప్పుడు తాజాగా కూడా మరోసారి ఆమె ట్రోలర్స్‌ బారినపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీ విలీనం గురించి షర్మిల తన భర్త అనిల్‌ కుమార్‌ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీని కలిశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే సోనియాను కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీతోపాటు రాజీవ్‌ గాంధీని కూడా కలిశానని చెప్పారు.. షర్మిల. దీంతో మరోసారి ట్రోలర్స్‌ కు అడ్డంగా దొరికిపోయారు.

రాజీవ్‌ గాంధీ 1990ల్లోనే మరణించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కలవడం ఏమిటంటూ షర్మిలపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ‘‘ఇంకా నయం.. ఇందిరాగాంధీని కూడా కలకవపోయారా?’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంకొక నెటిజన్‌..‘‘ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డిలను కూడా కలవకపోయారా’’ అని వెటకారం చేశారు. మరొక నెటిజన్‌.. ‘‘మా అక్కకి సంతోషం ఎక్కువ’’ అంటూ సెటైర్‌ పేల్చారు.

రాహుల్‌ గాంధీని కూడా కలిశాను అని చెప్పడం షర్మిల ఉద్దేశం కావచ్చు.. అయితే పొరపాటున రాజీవ్‌ గాంధీని కలిశానని చెప్పడంతోనే ట్రోలర్స్‌ కు పనిచెప్పారు. ఇక ట్రోలర్స్‌ ఆగుతారా.. ఆమె వ్యాఖ్యలపై చెడుగుడు ఆడేశారు. అందుకే ఆచితూచి మీడియా ముందు మాట్లాడకపోతే రాజకీయ నాయకులు చిక్కుల్లో పడక తప్పదు. అందుకు నిదర్శనమే షర్మిల.