Begin typing your search above and press return to search.

ఢిల్లీ వేదికగా షర్మిల కొత్త స్కెచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను చేపట్టిన వైఎస్‌ షర్మిలారెడ్డి దూకుడుగా కార్యకలాపాలను సాగిస్తున్నారు

By:  Tupaki Desk   |   31 Jan 2024 10:30 AM GMT
ఢిల్లీ వేదికగా షర్మిల కొత్త స్కెచ్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను చేపట్టిన వైఎస్‌ షర్మిలారెడ్డి దూకుడుగా కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలలా ఆమె పర్యటిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ లో కొనసాగి.. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి కాంగ్రెస్‌ లోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే తన తండ్రి వైఎస్సార్‌ కు అత్యంత సన్నిహితులుగా పేరొంది.. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా లేని నేతల ఆశీస్సులు పొందుతున్నారు. వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

మరోవైపు జగన్, చంద్రబాబులపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదాను గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని ఫైరవుతున్నారు. పోలవరం ఇప్పటివరకు పూర్తి కాలేదని, రైల్వే జోన్‌ తో సహా ఏపీ విభజన హామీలను జగన్‌ ప్రభుత్వం సాధించుకోలేకపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్‌ షర్మిల ఢిల్లీ కేంద్రంగా కొత్త స్కెచ్‌ గీస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఇందుకు తన అన్న జగన్‌ బాటనే ఆమె ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ప్రత్యేక హోదా కోసం పలు దీక్షలు చేశారు. ఢిల్లీ కూడా వెళ్లి అక్కడ కూడా దీక్ష చేపట్టారు. తనకు 20 మందికి పైగా ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఊరూవాడా జగన్‌ హోరెత్తించారు.

ఇప్పుడు అచ్చం ఇలాగే వైఎస్‌ షర్మిల కూడా తన అన్న జగన్‌ బాటలో నడుస్తారని సమాచారం. ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేక హోదా కోసం షర్మిల ఉద్యమిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఈ అంశం పడుతుందని ఆమె భావిస్తున్నారు.

ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ షర్మిల దీక్షకు కూర్చొంటారని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. తన అన్న వైఎస్‌ జగన్‌ ఎక్కడ అయితే విఫలమయ్యారో ఆ అంశాలనే పట్టుకుని కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం తేవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.

జగన్‌ ప్రత్యేక హోదా తెస్తాననే ప్రధాన హామీతోనే అధికారంలోకి వచ్చారని.. అయినా ఈ ఐదేళ్లలో ఆ అంశాన్నే కేంద్రం వద్ద జగన్‌ ప్రస్తావించలేదని షర్మిల నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అన్నపై ప్రత్యేక హోదా అస్త్రాన్నే ప్రయోగించాలని ఆమె నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలో దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నాటికి ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులంతా హస్తిన రావాలని షర్మిల ఇప్పటికే పిలుపిచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా జగన్‌ చేసిన ప్రసంగాలు, దీక్షల వివరాలను రాష్ట్ర ప్రజలకు షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేస్తారని తెలుస్తోంది. జగన్‌ మాటలను విశ్వసించి వైసీపీకి భారీ విజయాన్ని అందిస్తే.. ఎంత నమ్మక ద్రోహం చేశారో వివరిస్తారని చెబుతున్నారు.

ఇప్పటికే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులోనే హామీ ఇచ్చిందని.. దాన్ని అమలు చేయాలని షర్మిల ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రత్యేక హోదా అమలుతోపాటు పోలవరం నిర్మాణంతోపాటు అసంపూర్తిగా వదిలేసిన హామీలను బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచాలని షర్మిల ఆ లేఖలో కోరారు.

ఇవే కాకుండా కేంద్ర హామీల్లో భాగంగా దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, కలహండి–బుందేల్‌ ఖండ్‌ తరహాలో రాయలసీమ–ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, నూతన రాజధాని నిర్మాణం లాంటివన్నీ అసంపూర్తిగానే మిగిలి పోయాయన్నారు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటుపరం చేసే యత్నాలు మరింత బాధిస్తున్నాయి అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.