గాడిదలు కాయండి అని తిట్టిన షర్మిలే.. పోలీసులకు హారతులిచ్చి
కాగా, పాదయాత్ర, నిరుద్యోగ దీక్ష తదితర ఆందోళనల సమయంలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 18 Aug 2023 1:46 PM ISTఅన్న పొరుగు రాష్ట్రంలో సీఎంగా ఉండగా.. ఆయనతో విభేదించి.. పూర్తి భిన్నమైన తెలంగాణలో పార్టీని స్థాపించిన షర్మిల సుదీర్ఘ పాదయాత్ర సైతం చేసి హడావుడి రేపారు. వివాదాస్పద వ్యాఖ్యలకు తోడు ప్రభుత్వం అడ్డుకోవడంతో వార్తల్లోనూ నిలిచారు. పాలేరులో పోటీ చేస్తానంటూ సందడి చేసి.. చివరకు పార్టీని కాంగ్రెస్ లో కలుపుతున్నారు. సొంతంగా పార్టీ స్థాపించడం ఎవరికైనా సులువే. కానీ.. దానిని నిర్వహించడం ఎంత కష్టమో షర్మిల ఉదంతం మరోసారి చాటుతోంది.
కాగా, పాదయాత్ర, నిరుద్యోగ దీక్ష తదితర ఆందోళనల సమయంలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో పోలీసులు అడ్డుకోవడం రోడ్డుమీద బైఠాయించారు. "మీకేం పని లేదా? ఏం పనిలేకపోతే గాడిదలు కాసుకోండి పోయి" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనికి పోలీసు సైతం అంతే స్థాయిలో.. "అదే పని చేస్తున్నాం’’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాంటి షర్మిల.. సొంత పార్టీని విలీనం చేస్తున్నందుకు నెర్వస్ నెస్ కారణమో..? మరేమిటో కాని పోలీసులకు హారతిచ్చి మరీ అభినందనలు తెలిపారు. ఇంతకూ ఏం జరిగిందంటే..?
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని జగదేవపూర్ మండలం తీగుల్ లో దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ కొన్నాళ్ల కిందట ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు షర్మిలను శుక్రవారం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునే ఉద్దశంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతోపాటు షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
గజ్వేల్ వెళ్లి తీరుతా..ఎలాగైనా గజ్వేల్ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. అయితే, ఇందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అంతేగాక గృహ నిర్బంధం చేయడంపై నిరసన తెలిపారు. గజ్వేల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు షర్మిల స్వయంగా హారతి ఇచ్చారు. "మీ పని సరిగా సార్" అని కూడా వ్యాఖ్యానించారు. తనను హైదరాబాద్ లో అడ్డుకున్నారు సరే..? తన రాకను నిరసిస్తూ గజ్వేల్ లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
యథాప్రకారం నిందలు..హారతి ఇచ్చి మంచిగా పనిచేయండి సర్ అని చెప్పిన షర్మిలే.. కాసేపటికి పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలి. "శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారు. గజ్వేల్ వెళ్దాం అనుకుంటున్న నేను దేనికి అనుమతి తీసుకోవాలి? ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? కేసీఆర్ నన్ను చూసి భయపడుతున్నారు" అని వ్యాఖ్యానించారు. చివరకు తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్ పాండ్‌లోనే షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె చెప్పారు.
