Begin typing your search above and press return to search.

ఏపీ కోసం షర్మిళ 9 గ్యారెంటీలు... నెట్టింట "ఆగడు" సెటైర్లు!

ఇందులో ప్రత్యేక హోదాతో పాటు నెల నెలా ప్రతీ పేద మహిళకు రూ.8,500 ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం.

By:  Tupaki Desk   |   30 March 2024 4:39 PM IST
ఏపీ కోసం షర్మిళ  9 గ్యారెంటీలు...  నెట్టింట ఆగడు సెటైర్లు!
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ - కూటమి మధ్యే పోరు ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే... ఈ గ్యాప్ లో తాము కూడా బరిలో ఉండాలని, సత్తా చాటాలని కాంగ్రెస్స్ పార్టీ కూడా భావిస్తుంది! దీంతో... దక్షిణాది రాష్ట్రాల్లో అచ్చొచ్చిన గ్యారెంటీలను తెరపైకి తెచ్చింది. అయితే... మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయడానికి అవకాశం ఉందనే నమ్మకంతోనో ఏమో కానీ.... కాస్త ఆచి తూచి హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీకి వచ్చేసరికి చేతికి ఎముక లేనట్లుగా మారిపోయింది.

అవును... అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కథనాలొచ్చిన వేళ కర్ణాటకలో 5, తెలంగాణలో 6 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ఏపీకి వచ్చేసరికి మాత్రం చేతికి ఎముక లేనట్లుగా హామీలు ప్రకటించేసింది. ఇందులో భాగంగా 9 గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ప్రత్యేక హోదాతో పాటు నెల నెలా ప్రతీ పేద మహిళకు రూ.8,500 ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. ఈ రకంగాఉన్న “ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు” ఏమిటనేది ఒకసారి చూద్దాం...!

• ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా

• ప్రతీ పేద మహిళకు నెలకు రూ.8,500 (ఏడాదికి రూ.1,02,000)

• రెండు లక్షల వరకూ రైతు రుణమాఫీ

• పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర

• ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.400

• కేజీ టూ పీజీ ఉచిత విద్య

• రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ

• ఇల్లు లేని పేద కుటుంబానికి మహిళ పేరుమీద రూ.5 లక్షలతో పక్కా ఇల్లు

• అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ (ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ)

ఈ విధంగా 9 గ్యారెంటీలను వైఎస్ షర్మిళ ప్రకటించారు! ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చేసే తొలి సంతకం ఉద్యోగాల భర్తీమీదే అని వైఎస్ షర్మిళ ప్రకటించారు. ఇదే సమయంలో ఏప్రిల్ 1న ఏపీ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 9 గ్యారెంటీలపై ఆన్ లైన్ వేదికగా సెటైర్లు మొదలైపోయాయి! ఈ సందర్భంగా ‘ఆగడు’ సినిమాలోని ఎమ్మెస్ నారాయణ డైలాగులను రాస్తున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... "నీళ్లు లేని బావిలో గిలకలెక్కువ.. పేలని బాంబుకు ఒత్తి పొడవు.. పోయిన సినిమాకే పబ్లిసిటీ ఎక్కువ అన్నట్లు... అధికారంలోకి వచ్చే అవకాశం లేని పార్టీలకు హామీలెక్కువ" అంటూ ఆపాదిస్తున్నారు!!