వైఎస్ షర్మిల.. జోక్ ఆఫ్ ద మిలీనియం!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సర్వం సిద్ధమైంది
By: Tupaki Desk | 3 Jan 2024 9:19 AM GMTవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సర్వం సిద్ధమైంది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పీసీపీ పగ్గాలు ఆమె చేతిలో పెడతారని అంటున్నారు. జనవరి 3న సాయంత్రం తాను ఢిల్లీ వెళ్తున్నానని.. అక్కడ కాంగ్రెస్ పెద్దలను కలుస్తానని షర్మిల వెల్లడించారు.
తన కుమారుడు రాజారెడ్డికి, ఇడ్లీస్ రెస్టారెంట్ల యజమాని మనుమరాలు అట్లూరి ప్రియకు వివాహం సందర్భంగా షర్మిల, వధూవరులతో కలిసి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తొలి శుభలేఖ ప్రతిని ఆయన సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదాలు పొందారు. ఫిబ్రవరి 18న షర్మిల కుమారుడి వివాహం జరగనుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన వల్లే అధికారంలోకి వచ్చిందన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే కేసీఆర్ ఓడిపోయారని, తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదని.. బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్నే గుర్తించింది కాబట్టే తనను పార్టీలోకి రావాలని తనంతట తానుగా ఆహ్వానించిందని హాట్ కామెంట్స్ చేశారు.
అయితే ఇక్కడే షర్మిల వ్యాఖ్యలపై సెటైర్లు, ఘాటు కౌంటర్లు పడుతున్నాయి. గత ఎన్నికల్లో కడప ఎంపీ సీటును ఆశించిన షర్మిలకు తన అన్న జగన్ సీటు నిరాకరించారు. దీంతో ఆయన మీద అలిగి తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీని ఏర్పాటు చేసుకున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కాలికి బలపం కట్టుకుని 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఒక్కరంటే ఒక్క పేరున్న నేత, కనీసం నియోజకవర్గ స్థాయి నేత కూడా షర్మిల పార్టీలో చేరలేదని గుర్తు చేస్తున్నారు.
షర్మిల పార్టీలో చేరిన చోటామోటా నేతలు కూడా ఆ తర్వాత ఆ పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరిపోయారని చెబుతున్నారు. చివరకు తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని బింకాలు పలికిన షర్మిల చివరకు ఓటమి భయంతో అక్కడ కూడా పోటీ చేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు. వాస్తవం ఇదయితే తన వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని షర్మిల ఎలా అంటారని నిలదీస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరలేదని.. కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఒక్కచోట కూడా ప్రచారం కూడా చేయలేదని.. కనీసం డిజిటల్ గా కూడా మద్దతు పలకలేదని గుర్తు చేస్తున్నారు.
తనను తాను అతిగా ఊహించుకుని షర్మిల కాంగ్రెస్ విజయం తన వల్లే అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో ఒంటి చేత్తో కాంగ్రెస్ కు విజయాన్ని సాధించిపెట్టింది.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రమేనని నెటిజన్లు కుండబద్దలు కొడుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలో ఆయన పోటీకి సై అనడమే కాకుండా దాదాపు 70కి పైగా సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారని చెబుతున్నారు. తద్వారా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసింది.. రేవంత్ మాత్రమేనని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కురువృద్ధుల్లాంటి నేతలు సైతం తమ నియోజకవర్గాలకే పరిమితమైతే రేవంత్ మాత్రమే కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను తన భుజానపైన వేసుకుని ఒంటరి పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది షర్మిల తన వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం వింతల్లో కెల్లా వింత అని ఎద్దేవా చేస్తున్నారు.
పాలేరు నుంచి తాను పోటీ చేయడం ఖాయమని చెప్పిన షర్మిల పోటీ చేసి ఉంటే ఆమె అసలు సామర్థ్యం తెలిసిపోయేదని అంటున్నారు. ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు పోటీ చేసింది లేదు.. పెట్టింది లేదు.. ఏం చేయకుండా కాంగ్రెస్ విజయం తన వల్లే అని ఆమె ఎలా చెప్పుకుంటారని నిలదీస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలు మిలీనియం ఆఫ్ ది జోక్ గా అభివర్ణిస్తున్నారు.
అసలు తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి ఇలా గండరగండడులాంటి నేతలు ఉండగా షర్మిల అవసరం ఆ పార్టీకి ఏముందని అంటున్నారు. అసలు అందుకేగా షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి అధిష్టానం నిరాకరించిందని గుర్తు చేస్తున్నారు. షర్మిల తన జోకులను ఇప్పటికైనా ఆపాలని కోరుతున్నారు.