Begin typing your search above and press return to search.

అక్కడ వైసీపీకి తలనొప్పులు కంటిన్యూ...!

విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీకి తలనొప్పులు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గాజువాక సీటు వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే స్వీట్ సీటు గా ఉండాలి.

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:35 AM GMT
అక్కడ వైసీపీకి తలనొప్పులు కంటిన్యూ...!
X

విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీకి తలనొప్పులు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గాజువాక సీటు వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే స్వీట్ సీటు గా ఉండాలి. ఎందుకంటే పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన సీటు అది. అలాంటి సీటులో మరోసారి గెలవడానికి వైసీపీ చూడాలి. అయితే గాజువాక సీటు విషయంలో వైసీపీ హై కమాండ్ నెల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది.

దాంతో ఈ సీటులో చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడు దేవాన్ రెడ్డి కోసం సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా కార్పోరేటర్ గా ఉన్న ఉరుకూటి రామచంద్రరావుకు అధినాయకత్వం ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. దాంతో తిప్పల వర్గం రగిలిపోతోంది.

తమకు కాకుండా సీటు ఎలా ఇస్తారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపధ్యంలో గాజువాకలో నిట్టనిలువుగా వైసీపీ చీలిపోయింది. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సైతం ఈ గొడవ తీర్చలేనిదిగా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే పని తీరు సరిగ్గా లేకపోతే ఇంచార్జి సీట్లలో కూడా మార్పు ఉంటుందని అధినాయకత్వం నుంచి సంకేతాలు వెలువడడంతో ఇపుడు తిప్పల వర్గం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి అధినాయకత్వం ఎంపిక చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఇంటికి ఈ రెండు వర్గాలు వెళ్ళి మరీ తన గోడు వెళ్ళబోసుకుంటున్నాయి. విజయనగరంలోని బొత్స నివాసం ఇపుడు గాజువాక వైసీపీ నేతల వర్గ పోరుతో గరం గరంగా మారిపోతోంది.

ఈ రెండు వర్గాలు బలంగానే ఉన్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకూటికి బీసీ కార్డు కోసం ఎంపిక చేశారు. ఆయన్ని కాదంటే అది ఇబ్బంది. అలాగే తిప్పలకు జనంలో ఆదరణ తగ్గింది అని భావించే ఈ మార్పు చేశారు. ఆయనను కాదని కుమారుడికి టికెట్ ఇచ్చినా గెలుపు అవకాశాలు ఉండవని కూడా అంటున్నారు.

అయితే ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మికి గాజువాక కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆమె ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఉరుకూటి రామచంద్రరావుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్దతు ఇస్తున్నారు. ఆయన సిఫార్సుతోనే ఈ సీటు ఉరుకూటికి దక్కిందని అంటున్నారు.

అలాగే బొత్స వద్ద గుడివాడకు పలుకుబడి ఉందని అంటున్నారు. దాంతో ఉరుకూటి సీటుకు గ్యారంటీ అని ఆయన వర్గం అంటోంది. ఇవన్నీ పక్కన పెడితే టికెట్ దక్కకపోతే తిప్పల వర్గం తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే అపుడు గాజువాకలో వైసీపీ విజయానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఎంపీ సీటుకు కూడా విజయావకాశాలను గాజువాక వర్గ పోరు ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి మరి గాజువాక వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో.