Begin typing your search above and press return to search.

కూతురి కులాంతర ప్రేమవివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే!

సాధారణంగా చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. ఆచరించేందుకు ఆమడ దూరం ఉంది అనే కామెంట్ ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో వినిపిస్తుండే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:30 AM GMT
కూతురి కులాంతర ప్రేమవివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే!
X

సాధారణంగా చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. ఆచరించేందుకు ఆమడ దూరం ఉంది అనే కామెంట్ ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో వినిపిస్తుండే సంగతి తెలిసిందే. అయితే అందరూ అలా ఉండరు.. ఆదర్శవంతులైన నేతలు కూడా ఉంటారు అని నిరూపించే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్యే! ఇందులో భాగంగా కుమార్తె కులాంతర ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.

అవును... సాధారణంగా కులాంతర వివాహాలు జరగాలని, మతాంతర పెళ్లిల్లు జరగాలని, ఫలితంగా సమాజంలో కులమత బేధాలు పోవాలని చాలామంది చెబుతుంటారు కానీ... వారివరకూ వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తారు! అందుకు చాలా పెద్దమనసు ఉండాలని అప్పుడు తెలుసుకుంటారు. ఆనాక చల్లబడుతుంటారు. కానీ.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మాత్రం చేతల్లో చేసి చూపించారు.

వివరాళ్లోకి వెళ్తే... కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె వివాహాన్ని ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దగ్గరుండి జరిపించారు. లీలా గోపీ పవన్ కుమార్‌ అనే వ్యక్తితో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి పెళ్లి చేశారు.

ఇలా సబ్ రిజిస్టార్ కార్యలయానికి రాకముందు సాంప్రదాయ బద్దంగా, అత్యంత నిరాడంబరంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగిన అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు ఎమ్మెల్యే రాచమల్లు!

అనంతరం ఈ విషయాలపై స్పందించిన ఆయన... పేదవాడైనా కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం వివాహం చేశానని.. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేశానని.. తన బిడ్డను మనస్ఫూర్తిగా ఆశీర్విదిస్తున్నానని తెలిపారు.

దీంతో కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇది అత్యంత ఆదర్శవంతమైన నిర్ణయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ విషయానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తీసిన ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.