Begin typing your search above and press return to search.

బొత్సకు ప్రయారిటీ...ఆ సీనియర్ మంత్రి డిమాండ్...!?

ఆ సీనియర్ మంత్రి ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు. ఆయన రెండు టికెట్లు అడిగారు అని ప్రచారంలో ఉంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 3:46 AM GMT
బొత్సకు ప్రయారిటీ...ఆ సీనియర్ మంత్రి డిమాండ్...!?
X

ఉత్తరాంధ్రాలో బొత్స సత్యనారాయణకు విపరీతమైన ప్రాధాన్యతను వైసీపీ అధినాయకత్వం ఇస్తోంది. వైసీపీలో ఎవరికీ దక్కనివి బొత్సకు మాత్రమే దక్కుతున్నాయి. పార్టీలో ఎవరైనా రెండు సీట్లు అడిగితే నో చెబుతున్న అధినాయకత్వం బొత్సకు మాత్రం ఫ్యామిలీ ప్యాకేజీనే ఇస్తోంది అని అంటున్నారు.

బొత్సకు చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇస్తూ ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మికి విశాఖ ఎంపీ సీటు ఇచ్చారు. బొత్స తమ్ముడికి గజపతినగరం సీటు ఇచ్చారు. బొత్స బంధువులకే నెల్లిమర్ల, ఎస్ కోట టికెట్లు కన్ ఫర్మ్ అయ్యాయి. బొత్స మేనల్లుడికి విజయనగరం ఎంపీ సీటు ఇస్తారని టాక్. మరో బంధువు సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కి కూడా అసెంబ్లీ దారి చూపిస్తారని ప్రచారంగా ఉంది.

మరి ఇంతలా బొత్సకు అవకాశాలు ఇస్తున్న వైసీపీ హై కమాండ్ అదే ఉత్తరాంధ్రాలో ఉన్న మరో సీనియర్ మంత్రి విషయంలో వివక్ష చూపిస్తోందా అంటే ఆయన వర్గం అదే డౌట్ పడుతోంది. ఆ సీనియర్ మంత్రి ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు. ఆయన రెండు టికెట్లు అడిగారు అని ప్రచారంలో ఉంది. తనకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చి తన కుమారుడికి శ్రీకాకుళం అసెంబ్లీ సీటు ఇవ్వమని కోరారని అంటున్నారు.

దానికి నో చెప్పిన హై కమాండ్ ధర్మాననే ఎంపీగా పోటీ చేయమని కోరింది. ఇక ధర్మాన కుమారుడు రాం మనోహర్ నాయుడు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకునే పెద్దాయన రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. ఆయన మీడియా ముందే ఓపెన్ గా జగన్ నన్ను పోటీ చేయమన్నారు కానీ ప్రజలు ఏమంటే అదే చేస్తాను అని చెబుతున్నారు.

దీని వెనక ఆయన కుమారుడికి సీటు ఇప్పించుకోవాలన్న తపన ఉంది అని అంటున్నారు. తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వకపోతే కనీసం శ్రీకాకుళం అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని ప్రసాదరావు కోరుతున్నారు అని అంటున్నారు. కుమారుడి కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటాను అని ఆయన అంటున్నారు. అయితే దానికి వైసీపీ హై కమాండ్ మాత్రం నో చెబుతోంది. ఇక్కడే సీనియర్ మంత్రి ఏమి చేయబోతున్నారు అన్నది చర్చకు వస్తోంది.

ఇదిలా ఉంటే బొత్సకు హై కమాండ్ ప్రయారిటీ ఇవ్వడం వెనక ఆయన రాజకీయ బలం సామాజిక బలం కూడా కారణం అంటున్నారు. ఆయన విజయనగరం జిల్లాలో వైసీపీని మొత్తానికి మొత్తం మళ్లీ గెలిపించుకుని వస్తారని అంటున్నారు. అందుకే ఆయనకు ఆ విలువ ఇచ్చారని అంటున్నారు.

ఇక ధర్మాన ప్రసాదరావు విపక్షాన్ని పెద్దగా విమర్శించరని అంటారు. పైగా ఆయన గతంలో అంటే మంత్రి పదవి రాక ముందు తరచూ కొన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్స్ కూడా చేశారు అని అంటున్నారు. ఇక ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు కానీ సమర్ధతే గీటు రాయి అని వైవీ సుబ్బారెడ్డి కూడా చెబుతూ వస్తున్నారు.

గెలుస్తారు అనుకున్న వారికే టికెట్లు అని అంటున్నారు. బొత్స ఝాన్సీలక్ష్మి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. బొత్స తమ్ముడు అప్పలనరసయ్య కూడా కాంగ్రెస్ హయాంలో గెలిచారని, అలాగే బెల్లాన చంద్రశేఖర్ కాంగ్రెస్ టైం లోనే జెడ్పీ చైర్మన్ అయ్యరని ఉదహరిస్తున్నారు.

మరో వైపు చూస్తే శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లో టీడీపీ గట్టిగా ఉంది. మంత్రి పదవిలో ధర్మాన ఉన్నా కూడా టీడీపీ బలాన్ని తగ్గించలేకపోయారని అంటున్నారు. ఇపుడు ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే టీడీపీకి ఈజీ అవుతుందని అందుకె పెద్దాయన్ను పోటీకి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే కొన్ని చోట్ల వారసులకు సై అన్న వైసీపీ హై కమాండ్ మరి కొన్ని చోట నై అనడానికి కారణాలు తెలియక సీనియర్లు మాత్రం హర్ట్ అవుతున్నారని ప్రచారంలో ఉంది.