ఇన్ని చేస్తున్నా అసలు తేడా ఎక్కడ... వైసీపీలో టెన్షన్...!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని.. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా పథకాలు ఇస్తోందని..
By: Tupaki Desk | 18 Aug 2023 2:15 PM ISTఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని.. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా పథకాలు ఇస్తోందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోందని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు వివిధ పథకాల రూపంలో తమ సర్కారు అందిం చిందని ఇటీవల ఆయన చెప్పుకొచ్చారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా నెలనెలా 1నే ఠంచనుగా పింఛను ఇస్తున్నామని చెప్పారు.
ఇతర పథకాలపైనా అవగాహన కల్పిస్తున్నామని, అర్హులను ఎక్కడున్న వెతికి పట్టుకుని మరీ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం సర్కారుపై వ్యతిరేకత తగ్గ డం లేదు. ఎక్కడికక్కడ ప్రజలు ఆవేదన , ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి అనంత పురం జిల్లాలో ఎంపీ తలారి రంగయ్య గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను కలిశారు.
అయితే, పింఛన్, రోడ్లు, విద్యుత్ సమస్యలపై ప్రజలు వారిని నిలదీశారు. దేవమ్మ అనే వృద్ధురాలి ఇంటి వద్దకు వెళ్లిన ఎంపీ ‘మీకు ప్రభుత్వం నుంచి 3 లక్షల వరకు డబ్బు వచ్చింది’ అని ఆమెతో అన్నారు. దీంతో ఆమె తమకు ఏమీ రాలేదని పెదవి విరిచింది. సమస్యలపై ప్రశ్నిస్తుండగా వైసీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక, దీనిపై స్థానికంగా నాయకులు కొద్ది సేపు చర్చించుకున్నారు.
వీరు చెబుతున్న లబ్ధిలో పింఛను కూడా ఉంది. ఇదే నాలుగేళ్లలో 1.20 లక్షలు ఉంది. అమ్మ ఒడి వంటి పథకం నాలుగు సార్లు అమలైంది. ఇది 60 వేలుగా ఉంది. అయితే.. ఈ వివరాలు క్షేత్రస్థాయిలో ఎవరికీ తెలియడం లేదనేది పార్టీ అధిష్టానం మాట. దీంతో ఇన్ని చేస్తున్నా.. అసలు తేడా ఎక్కడుంది? అంటూ నాయకులు.. దీర్ఘాలోచనలో పడిపోయారు.
