Begin typing your search above and press return to search.

రెబల్స్‌ పై వైసీపీ వేటు వేయనుందా?

ఇక ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 1:30 PM GMT
రెబల్స్‌ పై వైసీపీ వేటు వేయనుందా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని గట్టి లక్ష్యమే నిర్దేశించుకున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. 175కి 175 స్థానాల్లో గెలుపొందుతామని ఆయనతోపాటు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇందులో భాగంగా 'వె ఏపీ నీడ్స్‌ జగన్‌', 'జగనన్న ఆరోగ్య సురక్ష', 'గడప గడపకు మన ప్రభుత్వం', 'సామాజిక సాధికార బస్సు యాత్ర' తదితరాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జులు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలు సరిగా నిర్వహించనివారికి టికెట్లు ఇచ్చేది లేదని వైఎస్‌ జగన్‌ పలుమార్లు స్పష్టం ప్రకటించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడినవారి పేర్లను కూడా ఆ ప్రోగ్రామ్‌ సమీక్ష సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజల్లో ఉంటేనే టికెట్‌ అని స్పష్టం చేశారు.

ఇక ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇప్పటికే తొలి విడతలో 11 స్థానాలకు సంబంధించి కొత్త అభ్యర్థులను ప్రకటించడం, కొందరిని మార్చడం చేశారు. తాజాగా రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ రెండు విడతల్లో కొందరు సిట్టింగులకు సీట్లు దక్కలేదు.

సీట్లు దక్కనివారు ఇప్పటికే పార్టీ అధిష్టానంపై, రీజినల్‌ కోఆర్డినేటర్లపై, వైఎస్‌ జగన్‌ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బహిరంగంగా మీడియా ఎదుటే విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు విమర్శలు చేస్తుండటంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి వంటివారు పార్టీకి దూరమయ్యారు. వీరిలో ఆనం మినహాయించి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు.

అలాగే తాజాగా విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృçష్ణ యాదవ్‌ కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు సీట్లు లభించని నేతలు కూడా వేరే పార్టీల్లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వీరిపై వైసీపీ చర్యలు తీసుకోనుందని అంటున్నారు. పార్టీ లైనును ధిక్కరించి మీడియా ముందు విమర్శలు చేసిన నేతలకు షోకాజులు జారీ చేయనున్నారని చెబుతున్నారు. అలాగే వేరే పార్టీల్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయాల్సిందిగా శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ లను కోరనున్నారని చెబుతున్నారు.

రెబల్స్‌ పై గట్టి చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అలాగే ఒకరిని చూసి మరొకరు పార్టీపై, సీఎం జగన్‌ పై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకుంటే మిగిలినవారికి హెచ్చరికగా ఉంటుందని యోచిస్తోంది.