Begin typing your search above and press return to search.

పార్టీ గేర్ మార్చాలి.. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్

ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం.. మొహమాటాలకు పోవటం.. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించటం.. శషభిషలకు అవకాశం లేకుండా

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:35 AM GMT
పార్టీ గేర్ మార్చాలి.. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్
X

ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం.. మొహమాటాలకు పోవటం.. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించటం.. శషభిషలకు అవకాశం లేకుండా.. కుండ బద్ధలు కొట్టినట్లుగా విషయాల్ని తేల్చేసే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్టెల్ రోటీన్ కాస్త భిన్నంగా ఉంటాయి. టికెట్లు ఇచ్చే విషయంలో ఆయన తన తీరుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు. గెలుపు మాత్రమే ఎన్నికల్లో ప్రామాణికమైనప్పుడు.. అధికారం చేతికి రావాలంటే ఎన్నికల్లో విజయమే అవసరమైనప్పుడు.. ఆ దిశగా తీసుకునే నిర్ణయాల్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని చెప్పటమే కాదు.. ఎన్నికల్లో పోటీకి టికెట్ల ఇవ్వకపోనంత మాత్రాన వారిని విడిచి పెట్టమన్న అభయాన్ని ఇచ్చేసిన తీరు ఆసక్తికరమని చెప్పాలి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం (ఈ రోజు) ముగియనున్న వేళ.. గురువారం నుంచి ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏమేం చేయాలి? లాంటి అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికలు మరో ఆర్నెల్లకు వచ్చేసిన వేళ.. పార్టీ గేరు మార్చాలన్న కీలకమైన కామెంట్ చేసిన జగన్.. ఎన్నికల్లో టికెట్ల ఎంపిక విషయంలో తాను అనుసరించే విధానంపైనా క్లారిటీ ఇచ్చేశారు. సర్వేల ఆధారంగా టికెట్ల పంపిణీ ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. 175కు 175 సీట్లు సాధించటం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేయటం గమనార్హం.

ఎవరికి టికెట్లు ఇస్తే సరైనదన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తానని చెప్పిన జగన్.. టికెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ మనిషి తన మనిషి కాకుండా పోతాడని అనుకోవద్దని స్పష్టం చేశారు. 'టికెట్ ఇస్తే అది ఒక బాధ్యత. టికెట్ వచ్చినా.. రాకున్నా మీరు ఎప్పటికీ నా వాళ్లుగానే ఉంటారు. అది కచ్ఛితంగా గుర్తు పెట్టుకోండి. జుత్తు ఉంటేనే ముడి వేసుకోగలం. అధికారంలో ఉంటేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. టికెట్ ఇవ్వలేని పక్షంలో వారికి మరొకటి ఇస్తా. లీడర్ మీద.. పార్టీ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే అడుగులు సరైన మార్గంలో పడతాయి. టికెట్ల విషయంలో నేను తీసుకునే నిర్ణయాలకు అందరూ పెద్ద మనసుతో సహకరించాలి' అంటూ జగన్ స్పష్టం చేశారు.

పార్టీ నేతలు అనుసరించాల్సిన తీరుపైనా ఆయన కీలక సూచనలు చేశారు. ''ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా. వచ్చే ఆర్నెల్లు సరిగా పని చేయకపోయినా ఫర్వాలేదనే భావన సరికాదు. రానున్న ఆర్నెల్లు ఎలా పని చేస్తామన్నదే చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకొని ప్రతి అడుగూ ముందుకు వేయాలి. జగనన్న ఆరోగ్య సురక్ష.. ఏపీకి జగనే కావాలి (వై ఏపీ నీడ్స్ జగన్) అనే పేరుతో ప్రభుత్వ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలపై వచ్చే రెండు నెలల్లో నిర్వహించే ప్రచారంపై వివరాల్ని అందజేశారు. వైనాట్ 175? ఇది సాధ్యమేనని మరోసారి నమ్మకంగా చెప్పిన జగన్.. అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇది సాధ్యమని చెప్పారు.

మనం బలంగా ఉండబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయలేక.. భయపడి పొత్తులకు వెళ్తున్నాయన్న సీఎం జగన్.. గడప గడపకూ మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు.. వారి నుంచి వచ్చిన స్పందనను చూశామని. ఇదే ఆత్మవిశ్వాసంతో.. ఇదే ధైర్యం.. ఇదే ముందుచూపు.. ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పరిశీలకులు.. ప్రాంతీయ సమన్వయకర్తలు ఇంకా క్రియాశీలక పాత్ర పోషిస్తారన్న జగన్.. ప్రతి నియోజకవర్గంలో విభేదాలు లేకుండా చూసుకోవటం అన్నది చాలా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. గ్రామ.. మండలస్థాయి నాయకుల్లో ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిన పరిష్కరించుకొని సమన్వయపర్చుకొని అడుగులు వేయాలంటూ.. రాబోయే రోజుల్లో పార్టీ కీలక నేతలు చేయాల్సిన కార్యాచరణకు సంబంధించిన టాస్కును వివరంగా చెప్పేశారు.