Begin typing your search above and press return to search.

వైసీపీ బస్సు యాత్ర

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేతలందరినీ పూర్తిగా జనాల్లోనే ఉంచుతున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 6:12 AM GMT
వైసీపీ బస్సు యాత్ర
X

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేతలందరినీ పూర్తిగా జనాల్లోనే ఉంచుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల బస్సుయాత్రను డిజైన్ చేశారు. 100 రోజుల పాటు జిల్లాల అధ్యక్షులు ఆధ్వర్యంలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా జిల్లాల్లో తిరగాలని చెప్పారు. వచ్చేనెల మొదటివారం నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవబోతోంది. బస్సుయాత్ర ద్వారా అందరు వివిధ వర్గాలను కలవాలన్నది జగన్ ఆలోచన. సమస్యలను దగ్గర నుండి ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాలను కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకోవటమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఇప్పటికే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మొదలైంది. చాలాకాలంగా జరుగుతున్న గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం అందరికీ తెలిసిందే. డిసెంబర్ మొదటివారం వరకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, నేతలందరు జనాల్లో ఉండేట్లుగా జగన్ కార్యక్రమాన్ని రూపొందించారు. జనాలు ఎలా రియాక్టవుతారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వాళ్ళు ఎలా రియాక్టయినా మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు జనాల్లో తిరగటమన్నదే కీలకమని జగన్ స్పష్టంగా చెప్పారు.

వందరోజులు బస్సుయాత్రను ఎందుకు ప్లాన్ చేశారంటే ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకనే కోడ్ అమల్లోకి వచ్చేలోగానే పార్టీపరంగా, ప్రభుత్వపరంగా వీలైనన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నారు. రెగ్యులర్ గా జనాల్లో ఉండేవాళ్ళనే జనాలు కూడా ఆధరిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే ఈమధ్యనే జిల్లాలకు కొత్త అధ్యక్షులను, కార్యవర్గాలను నియమించారు.

ఈ బస్సుయాత్రలో వీలైనంతమంది పార్టీ నేతను ఇన్వాల్వ్ చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకనే జిల్లాల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. వీలైనంత తొందరలో మండల, గ్రామ కమిటీలను కూడా నియమించబోతున్నారు. కమిటీలను నియమించేసిన తర్వాత అందరినీ జనాల్లోనే తిరగాలని చెప్పారు ఇప్పటికే. మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లాల కమిటీలు అన్నీ జనాల్లోనే ఎందుకు ఉండాలంటే ప్రజల మనోగతాలు బయటపడతాయనే. ప్రభుత్వాన్ని, పార్టీని జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారన్న అంచనాల కోసమే జగన్ ఇన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మరి ఈ జిల్లాల బస్సుయాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి.